Regent International: ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం.. 20వేల మందికి పైగా ఆవాసం.. వీడియో చూస్తే మ‌తిపోవాల్సిందే!

Video Shows Worlds Largest Residential Building That Houses Over 20000 People

  • ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం రీజెంట్ ఇంటర్నేషనల్
  • చైనాలోని కియాన్‌జియాంగ్ సెంచరీ సిటీలో ద‌ర్శ‌న‌మిచ్చే అద్భుత‌మైన భ‌వంతి
  • 'ఎస్‌' ఆకారంలో ఉండే ఈ ఆకాశ హ‌ర్మ్యం ఎత్తు 675 అడుగులు
  • 1.47 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణం, 39 అంతస్తుల‌తో నిర్మాణం
  • అనేక సౌకర్యాలు, వ‌స‌తుల‌కు కొద‌వేలేని భారీ నిర్మాణం

ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనమైన 'రీజెంట్ ఇంటర్నేషనల్' తాలూకు వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని కియాన్‌జియాంగ్ సెంచరీ సిటీలో ఈ అద్భుత‌మైన భ‌వ‌నం ఉంది. 675 అడుగుల ఎత్తైన ఈ ఆకాశ హ‌ర్మ్యాన్ని మొదట్లో హై-ఎండ్ హోటల్‌గా వినియోగించార‌ట‌. కానీ ఆ తరువాత విస్తారమైన అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌గా మారింది. 

'ఎస్‌' ఆకారంలో ఉండే రీజెంట్ ఇంటర్నేషనల్ 1.47 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైంది. చూడ‌గానే ఆకట్టుకునేలా ఉండే ఈ భ‌వంతిలో 39 అంతస్తులు ఉంటాయి. గరిష్ఠంగా 30 వేల మంది నివ‌సించేలా దీన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం ఈ నివాస భ‌వ‌నంలో 20వేల‌ మందికి పైగా నివాసితులు ఉన్నారు.

ఇక ఈ భారీ నిర్మాణం అనేక సౌకర్యాలు, వ‌స‌తుల‌ను క‌లిగి ఉండ‌డం మ‌రో విశేషం. ఇందులోని నివాసితులు త‌మ‌ రోజువారీ అవసరాల కోసం ఎప్పుడూ భ‌వంతి ప్రాంగణాన్ని దాటి బ‌య‌ట‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఈ కాంప్లెక్స్‌లో షాపింగ్ మాల్స్‌, రెస్టారెంట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వినోద కార్య‌క్ర‌మాలు.. ఇలా స‌క‌ల‌ సౌకర్యాలు అందులోనే ఉన్నాయి.

అలాగే నివాసితుల కోసం అవసరమైన అత్యాధునిక ఫిట్‌నెస్ సెంటర్‌లు, ఫుడ్ కోర్ట్‌లు, ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, కిరాణా దుకాణాలు, బార్బర్ షాపులు, విస్తారమైన గార్డెన్‌లు కూడా ఈ భ‌వంతిలోనే ఉంటాయి. ఇక ఈ భ‌వ‌నంలో ఇప్ప‌టికే 20వేల మందికి పైగా నివాసం ఉంటుండ‌గా.. మ‌రో 10వేల మందికి స‌రిప‌డా ఏర్పాట్లు ఉన్నాయి. కాగా, విస్తీర్ణాన్ని బ‌ట్టి ఇక్క‌డ రూ. 18వేల నుంచి రూ. 50వేల వ‌ర‌కు అద్దె ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇక ఈ ఆకాశ హ‌ర్మ్యం 2013లో ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. దీనికి సంబంధించిన వీడియో ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 

''అది అపురూపమైంది. ఈ ఆధునిక వాస్తుశిల్పం చాలా మందిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి, సమాజం యొక్క ప్రత్యేక భావాన్ని ఎలా సృష్టించగలదో చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది" అని ఒక‌రు కామెంట్ చేశారు. 

''ఇది మనోహరమైనది! ఒకే నివాస భవనంలో 20వేల‌ మందికి పైగా నివసించే ఆలోచన అద్భుతమైంది" అని మరొకరు వ్యాఖ్యానించారు. 

''వావ్.. ఇది ఒక చిన్న పట్టణం లాంటిది. ఇక్కడ మీరు మీ పొరుగువారితో ఎలివేటర్‌లో పరుగెత్తవచ్చు" అని ఇంకొక‌రు స్పందించారు.

  • Loading...

More Telugu News