Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తమిళనాడులో ఓ న్యాయవాది ఫిర్యాదు

Complaint filed in Tamil Nadu against Deputy CM Pawan Kalyan for speaking to create communal strife

  • తిరుపతి బహిరంగ సభలో వ్యాఖ్యలపై అభ్యంతరం
  • మత కలహాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారంటూ మధురై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు
  • పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోరిన వాంజినాథన్ అనే న్యాయవాది

తిరుపతిలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులో ఆయనపై ఒక ఫిర్యాదు నమోదయింది. మత కలహాలు సృష్టించేలా మాట్లాడారంటూ మధురై పోలీసు కమిషనర్ ఆఫీస్‌లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. పవన్ మాటలు దిగ్భ్రాంతికి గురిచేశాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వాంజినాథన్ అనే న్యాయవాది ఈ నెల 4న ఫిర్యాదు చేశారు. మైనారిటీ ప్రజలు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌లను ఉద్దేశించి, సామాజిక ఉద్రిక్తతలు సృష్టించేలా పవన్ మాట్లాడారని వాంజినాథన్ పేర్కొన్నారు.

కాగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై తిరుపతి సభలో పవన్ కల్యాణ్‌ పరోక్ష విమర్శలు గుప్పించారు. న్యాయవాది తన ఫిర్యాదులో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ముస్లిం, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలను రెచ్చగొట్టేలా, విద్వేషాలు సృష్టించేలా పవన్ మాట్లాడారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రజల మధ్య పగ, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ వాంజినాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్‌ ఏడాదిన్నర క్రితం సనాతన ధర్మం గురించి మాట్లాడారని, ప్రస్తుతం పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఉదయనిధిని మాత్రమే కాకుండా తమిళనాడు ప్రజలను, అంబేద్క‌ర్‌ని కూడా అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వెలువడిన వార్తా కథనాలు ప్రాతిపదికగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. 

ప్రజలంతా మత సామరస్యంతో జీవించాలనేది రాజ్యాంగం ఉద్దేశమని, కానీ దీనికి విరుద్ధంగా పవన్ మాట్లాడారని అన్నారు. ఏసుక్రీస్తు, అల్లా గురించి తప్పుగా మాట్లాడితే దేశాన్ని తగల బెడుతున్నారని, అలా హిందువులు ఎందుకు చేయకూడదని పవన్ మాట్లాడారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇక తిరుమల లడ్డూ వ్యవహారంలో ముస్లిం, క్రైస్తవులకు సంబంధం లేదని న్యాయవాది వాంజినాథన్ అన్నారు. నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలన్నీ హిందువులకు సంబంధించినవేనని అన్నారు.

  • Loading...

More Telugu News