Ind Vs Ban: అరంగేట్ర మ్యాచ్‌లోనే మ‌యాంక్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. సిక్స‌ర్ల‌లో బ‌ట్ల‌ర్‌ను వెన‌క్కి నెట్టిన‌ సూర్య‌!

Suryakumar Yadav and Mayank Yadav Creates New Records in T20s

  • గ్వాలియ‌ర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌, భార‌త్‌ తొలి టీ20
  • 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన భార‌త్‌
  • అరంగేట్ర మ్యాచ్‌లోనే త‌న తొలి ఓవ‌ర్‌ను మెయిడెన్‌గా వేసిన మ‌యాంక్‌
  • ఇలా తొలి మ్యాచ్‌లోనే మెయిడెన్ వేసిన మూడో భార‌త బౌల‌ర్‌గా రికార్డు
  • అంత‌ర్జాతీయ టీ20లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన నాలుగో బ్యాట‌ర్‌గా సూర్య

గ్వాలియ‌ర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. 7 వికెట్ల తేడాతో పర్యాటక జ‌ట్టును సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా భార‌త్ పేస‌ర్ మ‌యాంక్ యాద‌వ్ అరంగేట్రం చేశాడు. 

అలా తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అత‌డు అరుదైన ఘన‌త న‌మోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో త‌న తొలి ఓవ‌ర్‌ను మెయిడెన్‌గా ముగించాడు. త‌ద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ వేసిన మూడో భార‌త బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. గ‌తంలో 2006లో ద‌క్షిణాఫ్రికాపై అజిత్ అగార్క‌ర్, 2022లో ఇంగ్లండ్‌పై అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు. 

అలాగే బంగ్లాతో మ్యాచ్‌లోనే టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ కూడా స‌రికొత్త రికార్డు న‌మోదు చేశాడు. అంత‌ర్జాతీయ టీ20 అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన నాలుగో బ్యాట‌ర్‌గా సూర్య నిలిచాడు. అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు 139 సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఇంగ్లండ్ సారథి జోస్ బ‌ట్ల‌ర్ (137)ను వెన‌క్కి నెట్టాడు. 

ఈ జాబితాలో 205 సిక్సుల‌తో భార‌త స్టార్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ క్రికెట‌ర్ మార్టిన్ గ‌ప్టిల్ (173) ఉంటే, విండీస్ స్టార్ ఆట‌గాడు నికోల‌స్ పూర‌న్ (144) మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

  • Loading...

More Telugu News