Elon Musk: ఈసారి ట్రంప్ గెలవకుంటే ఇక అంతే... ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Elon Musk Joins Ex US President On Stage

  • ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టెస్లా అధినేత
  • అమెరికాలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ట్రంప్ ను గెలిపించాలని విజ్ఞప్తి
  • తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లతో కూడా ఓటు వేయించాలని అమెరికన్లకు పిలుపు

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ప్రచార సభలో పాల్గొన్న మస్క్... అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ట్రంప్ ను గెలిపించాలని కోరారు. లేదంటే అమెరికాలో ఒకే ఒక్క పార్టీ మిగులుతుందని, దేశంలో ఎన్నికలు జరిగే అవకాశమే లేదని హెచ్చరించారు.

మీకు తెలిసిన వాళ్లను, తెలియని వాళ్లను కూడా ఓటేసేలా ప్రోత్సహించాలని కోరారు. ఇప్పుడు ఓటేయకపోతే ఇక వారికి ఓటేసే అవకాశమే రాకపోవచ్చని చెప్పాలన్నారు. ఈసారి ట్రంప్ గెలవకుంటే ఆయనకు మాత్రమే కాదు, అమెరికాకు కూడా ఇవే చివరి ఎన్నికలు కావొచ్చని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికలు మన జీవితాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన ఎన్నికలు అని అన్నారు.

పెన్సిల్వేనియాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ తో కలిసి మస్క్ పాల్గొన్నారు. "మనకో ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన కనీసం విమానంలోకి వెళ్లేందుకు మెట్లు కూడా ఎక్కలేరు. మాజీ ప్రెసిడెంట్ (ట్రంప్ ను ఉద్దేశించి) మాత్రం బుల్లెట్ గాయం తగిలినా ధైర్యంగా నిలబడతారు. ధైర్యానికి ఇంతకు మించిన పరీక్ష అవసరం లేదు" అంటూ ట్రంప్ ను మస్క్ ప్రశంసించారు.

  • Loading...

More Telugu News