Israel: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర ఆగ్రహం

a major diplomatic brawl between Israel and France erupted

  • గాజాలో రాజకీయ పరిష్కారం కోసం ఆయుధాలు అందించబోమన్న వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ మండిపాటు
  • మేక్రాన్ సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారన్న బెంజమిన్ నెతన్యాహు 
  • వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాలో రాజకీయ పరిష్కారం సాధించేందుకుగానూ ఇజ్రాయెల్‌తో ఆయుధాల వాణిజ్యంపై నిషేధం విధించాలంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేక్రాన్ సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

‘‘ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నందున నాగరిక దేశాలన్నీ మా వైపు దృఢంగా నిలబడాలి. కానీ అధ్యక్షుడు మేక్రాన్, ఇతర పాశ్చాత్య దేశాల నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధాల ఆంక్షలు విధించాలంటూ పిలుపునిచ్చారు. వారికే ఇది అవమానకరం. వారి మద్దతు ఉన్నా లేకున్నా ఇజ్రాయెల్ గెలుస్తుంది. ఇరాన్ తన అనుకూల శక్తులపై ఇలాగే ఆయుధ ఆంక్షలు విధిస్తోందా?. కానీ, ఉగ్రవాద పక్షాన్ని వ్యతిరేకించే దేశాలు ఇజ్రాయెల్‌పై ఆయుధ నిషేధానికి ఎందుకు పిలుపునిస్తున్నాయి?. ఇది ఎంత అవమానకరం’’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

‘‘అనాగరికతకు వ్యతిరేకంగా మనల్ని మనం రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ పోరాడుతుంది. యుద్ధంలో గెలిచే వరకు నిశ్చితంగా ఇజ్రాయెల్ పోరాడుతుంది’’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం కూడా స్పందించింది. ఫ్రాన్స్‌కు ఇజ్రాయెల్ దృఢమైన మిత్రుడని, ఇజ్రాయెల్ భద్రతకు మద్దతిస్తామని అధ్యక్షుడు మేక్రాన్ చెప్పారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 

కాగా అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మేక్రాన్ మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులను యథాస్థితికి తీసుకురావాలని భావిస్తున్నామని, గాజాలో పోరాడటానికి ఇజ్రాయెల్‌కు ఆయుధాలను పంపిణీ చేయడం మానేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. కాగా ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్‌లో క్షేత్రస్థాయి దాడులకు కూడా దిగిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News