Deputy CMs: డిప్యూటీ సీఎంల మ‌ధ్య స‌నాత‌న వార్‌.. చిరును ట్యాగ్ చేస్తూ అనుచ‌రుల పోస్టులు!

Sanatana War Between Tamilnadu and Andhra Pradesh Deputy CMs

  • వారాహి డిక్లరేష‌న్ స‌భ‌లో స‌నాత‌న ధ‌ర్మంపై ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
  • ఆ వ్యాఖ్య‌ల‌తో ప‌రోక్షంగా ఉద‌య‌నిధి స్టాలిన్‌కు హెచ్చ‌రిక‌
  • గ‌తంలో స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి స్టాలిన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
  • సోద‌రుడి ఎమోష‌న్స్‌ను కంట్రోల్ చేసుకోమ‌ని చెప్పండి అంటూ చిరును మ‌ధ్య‌లోకి లాగిన స్టాలిన్ అనుచ‌రులు  

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్ మ‌ధ్య స‌నాత‌న ధ‌ర్మం వివాదం ముదురుతోంది. గురువారం నాడు తిరుపతిలో వారాహి డిక్లరేష‌న్ స‌భ‌లో జ‌న‌సేనాని పవన్ కల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా ఉద‌య‌నిధి స్టాలిన్‌ను హెచ్చ‌రించిన‌ట్లైంది. 

గ‌తంలో ఉద‌య‌నిధి స్టాలిన్ మాట్లాడుతూ, స‌నాత‌న ధ‌ర్మం వైర‌స్ లాంటిద‌ని దాన్ని నాశ‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించ‌డం వివాదాస్పదంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ జ‌రిగింది కూడా. 

ఆ వ్యాఖ్య‌ల‌ను తిరుపతిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తు చేస్తూ... స‌నాత‌న ధ‌ర్మం ఒక వైర‌స్ దాన్ని నాశ‌నం చేస్తాన‌ని ఒక యువ‌నేత అంటున్నాడు. నీలాంటోళ్లు చాలామంది వ‌చ్చారు. చ‌రిత్ర‌లో క‌లిసి పోయార‌ని వ్యాఖ్యానించ‌డం వివాదాస్పదంగా మారింది.  

ఇక శుక్ర‌వారం నాడు ఉద‌య‌నిధి స్టాలిన్‌ను ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించగా వేచిచూద్దాం ఏం జ‌రుగుతుందో అని చెప్పి వెళ్లిపోయారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతోంది. 

జ‌న‌సేనాని ల‌క్ష్యంగా డీఎంకే పార్టీ సోష‌ల్ మీడియా వింగ్ పాత వీడియోల‌ను పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తోంది. దీనిపై ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా జ‌న‌సేన‌, బీజేపీ వింగ్స్ కౌంట‌ర్ ఇస్తున్నాయి. 

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఉద‌య‌నిధి అనుచ‌రులు ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగుతున్నారు. మీ సోద‌రుడిని ఎమోష‌న్స్‌ను కంట్రోల్ చేసుకోమ‌ని చెప్పండి అంటూ చిరును ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల‌కు సీఎం స్టాలిన్‌తో చిరంజీవి దిగిన ఫొటోల‌ను జోడిస్తున్నారు. 

మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మిళ‌నాడులోని మ‌దురైలో కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. మ‌తాల‌ను రెచ్చ‌గొట్టేలా ప‌వ‌న్ వ్యాఖ్యానించారంటూ మ‌దురై న్యాయ‌వాది ఒక‌రు తాజాగా కేసు పెట్టారు. 

More Telugu News