Kinjarapu Ram Mohan Naidu: సుప్రీంకోర్టు ఆదేశాలను జగన్ స్వాగతిస్తారని భావించాం.. కానీ..: రామ్మోహన్ నాయుడు
- సిట్ దర్యాప్తు అంటే జగన్ కు ఎందుకంత భయమన్న రామ్మోహన్ నాయుడు
- సిట్ లేదు గిట్ లేదని జగన్ పలుచన చేశారని విమర్శ
- మోదీ, చంద్రబాబు ఆలోచనల మేరకు పని చేస్తానని వ్యాఖ్య
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు అంటే జగన్ కు ఎందుకంత భయమని టీడీపీ నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను జగన్ స్వాగతిస్తారని తాము భావించామని... అయితే, సిట్ లేదు గిట్ లేదని జగన్ పలుచన చేశారని, ఇది ఎంత వరకు సంస్కారమని ప్రశ్నించారు. సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు.
మరోవైపు, తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని ఈరోజు కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో దేశంలో 75 విమానాశ్రయాలు ఉండేవని... మోదీ ప్రధాని అయిన తర్వాత వాటిని 156కి పెంచారని కితాబిచ్చారు. త్వరలోనే ఒంగోలు, నెల్లూరు, పుట్టపర్తిలలో స్థలాన్ని పరిశీలించి కొత్త ఎయిర్ పోర్టులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు తాను పని చేస్తానని తెలిపారు.