Donald Trump: ఇరాన్ అణ్వాయుధ ప్లాంట్ లను ముందు ధ్వంసం చేయండి.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచన
- మిగతా లక్ష్యాల సంగతి తర్వాత చూసుకోవచ్చన్న మాజీ ప్రెసిడెంట్
- నార్త్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యలు
- ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై దాడిని సమర్థించబోనన్న అమెరికా ప్రెసిడెంట్ బైడెన్
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులలో హిజ్బుల్లా, హమాస్ సంస్థలకు చెందిన కీలక నేతలు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ స్పందించి ఇజ్రాయెల్ పైకి మిసైళ్ల వర్షం కురిపించింది. దాదాపు 200 మిసైళ్లను ప్రయోగించి హెచ్చరికలు పంపింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ దాడిపై ప్రస్తుతం ఇజ్రాయెల్ మౌనంగా ఉన్నప్పటికీ ప్రతీకార దాడులు తప్పకుండా చేస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుతం మరోసారి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఇరాన్ పై ప్రతీకార దాడుల విషయంలో ఇజ్రాయెల్ కు కీలక సూచన చేశారు.
ప్రతీకార దాడులను ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలతో మొదలు పెట్టాలని ట్రంప్ సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం అంతటికీ అణ్వాయుధాలతోనే ముప్పు పొంచి ఉందని గుర్తుచేశారు. అందుకే ముందుగా ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని, ఆపై మిగతా టార్గెట్లపై దృష్టి సారించవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందన సరికాదని విమర్శించారు. ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ప్రెసిడెంట్ బైడెన్.. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయాలన్న ఆలోచనను తాను సమర్థించబోనని చెప్పారు. దీనిని ట్రంప్ తప్పుబట్టారు.. ప్రపంచానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందు అణుకేంద్రాలపైనే దాడి చేయాలని ఇజ్రాయెల్ కు సూచించారు.