Supreme Court: రఘురామ కేసులో విశ్రాంత సీఐడీ అధికారి విజయపాల్ కు సుప్రీం కోర్టులో ఊరట ..ఏపీ సర్కార్‌కు నోటీసులు
- తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన సుప్రీం కోర్టు
- ఏపీ ప్రభుత్వానికి నోటీసులు .. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు
- తొలుత విజయ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు
మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజును గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడుగా ఉన్న సీఐడీ రిటైర్డ్ అదనపు ఎస్పీ ఆర్ విజయ పాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. విజయ్‌పాల్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనంలో విచారణ జరిగింది. దీనిపై సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు నోటీసులు జారీ చేస్తూ... తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ పిటిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవద్దని ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఈ కేసులో విచారణకు పూర్తిగా సహకరించాలని కూడా విజయపాల్ కు సుప్రీం కోర్టు సూచించింది.
తొలుత విజయపాల్ ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించగా, గత నెల 24న హైకోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును విజయపాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. విజయపాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ వాదనలు వినిపిస్తుండగా, న్యాయమూర్తులు కల్పించుకుని తాము ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎక్కువగా వాదనలు చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ విక్రమ్ నాథ్ సూచించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది.