ap hotels management: స్విగ్గీని బహిష్కరించాలని ఏపీ హోటళ్ల యజమానుల సంఘం నిర్ణయం..
- స్విగ్గీ, జొమాటో సమస్యలపై సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు
- స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయించిన హోటల్స్ అసోసియేషన్
- స్విగ్గీ, జొమాటోలతో హోటళ్లు, రెస్టారెంట్లకు నష్టం జరుగుతోందని ఆందోళన
ఏపీలోని హోటళ్ల యాజమాన్యాలు కీలక నిర్ణయాన్ని ప్రకటించాయి. విజయవాడలోని ఓ హోటల్ లో శుక్రవారం ఏపీ హోటల్స్ యాజమాన్యాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందిపెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు నష్టం జరుగుతోందని అసోసియేషన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలపై ఈ రెండు సంస్థల యాజమాన్యాలతో గతంలో చర్చలు జరపగా, జొమాటో మాత్రమే సానుకూలంగా స్పందించిందని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.