Jagan: నువ్వా... సనాతన ధర్మం గురించి మాట్లాడేది?: పవన్ పై జగన్ విమర్శలు
- తిరుపతి వారాహి సభలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్
- చంద్రబాబు చేసిన తప్పును పవన్ సమర్థిస్తున్నాడన్న జగన్
- అలాంటప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడితే అర్థమేముందని వ్యాఖ్యలు
తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అసలు ఈ మనిషికి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? అని ఎత్తిపొడిచారు.
"నువ్వు ఆ కూటమిలో ఉన్నావు... నీ కళ్ల ఎదుటే చంద్రబాబు ఈ తప్పు చేశాడు... అది తప్పు అన్న విషయం నీకే కాదు ఆరేళ్ల పిల్లాడికి కూడా అనిపిస్తుంది. తిరుమల పవిత్రతను తగ్గిస్తూ, వెంకటేశ్వరస్వామి లడ్డూ విశిష్టతను తగ్గిస్తూ, కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారి మనసుల్లో అనుమానాన్ని సృష్టించడం నీ కళ్ల ఎదుటే జరుగుతోంది కదా!
అందులో నువ్వు కూడా భాగమయ్యావు, ఆ అబద్ధాలకు రెక్కలు కట్టావు... నువ్వే దుష్ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నావు... అలాంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని మనం ఎత్తిచూపకుండా, గుడ్డిగా దాన్ని సమర్థిస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా!" అంటూ జగన్ వ్యాఖ్యానించారు.