Thummala: ఏదైనా పథకాన్ని ఆపి అయినా ఈ హామీలు నెరవేరుస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao says will fullfill all promises

  • రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు మాట్లాడుతున్నాయని విమర్శ
  • అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తామన్న మంత్రి
  • రైతుకు ఇబ్బంది కలగవద్దని రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారన్న మంత్రి

ఆర్థికంగా కష్టమైనా... ఏదైనా ఒక పథకాన్ని ఆపి అయినా సరే రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమాను అమలు చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ కాలేదంటూ కేటీఆర్ విమర్శలు చేయడంపై మంత్రి స్పందిస్తూ... గతంలో రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని విమర్శించారు. రైతులు ఆదరిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఏదైనా పథకాన్ని ఆపి అయినా సరే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు కచ్చితంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దన్నారు. దేశంలో ఎక్కువ పంటలను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు. మన రాష్ట్రంలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News