Akhil Akkineni: కొండా సురేఖను క్షమించేది లేదు: తీవ్రస్థాయిలో మండిపడిన అఖిల్ అక్కినేని
- ఎక్స్ వేదికగా మంత్రిపై అఖిల్ ఆగ్రహం
- మన సమాజంలో ఇలాంటి వారిని క్షమించే అవకాశం లేదని వ్యాఖ్య
- నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలన్న అఖిల్
నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తీవ్రంగా స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, జుగుప్సాకరమైనవని, ఆ వ్యాఖ్యలు క్షమించరానివి అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అఖిల్ మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన సమాజంలో ఆమెలాంటి వారిని క్షమించే అవకాశమే లేదని పేర్కొన్నారు.
కొండా సురేఖ చేసిన నిరాధారమైన ప్రకటనలు దారుణంగా ఉన్నాయని, ప్రజాసేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరిచిపోయారని విమర్శించారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు అని, క్షమించరానిదని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో సమాజంలో గౌరవం కలిగిన, నిజాయతీ కలిగిన కుటుంబం గాయపడిందని రాసుకొచ్చారు. ఆమె తన వ్యాఖ్యలతో అగౌరవాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు.
రాజకీయ యుద్ధంలో స్వార్థపూరితంగా గెలిచే ప్రయత్నంలో ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన కలిగిన వ్యక్తులపై దారుణంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా వారిని బలిపశువులను చేశారన్నారు. ఓ కుటుంబ సభ్యుడిగా, సినిమా కుటుంబంలోని వ్యక్తిగా తాను మౌనంగా ఉండదల్చుకోలేదన్నారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలన్నారు. మన సమాజంలో ఇలాంటి వాళ్లకు స్థానం లేదని, గౌరవమూ పొందలేరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు క్షమించరానివని, సహించలేనివని స్పష్టం చేశారు.