oxygen Therapy: ఇజ్రాయెల్ టైం మెషీన్‌తో 60 ఏళ్ల వ్యక్తులను 25 ఏళ్ల నవ యువకులుగా మార్చేస్తామంటూ రూ. 35 కోట్లు కొట్టేసిన జంట
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
- ‘రివైవల్ వరల్డ్’ పేరుతో థెరపీ సెంటర్ ప్రారంభించిన జంట
- ఆక్సిజన్ థెరపీ సాయంతో యవ్వనాన్ని తిరిగి తెప్పిస్తామని హామీ
- వారి ప్రకటనలు నమ్మి మోసపోయిన వందలాదిమంది
ఇజ్రాయెల్ టైం మెషీన్ సాయంతో 60 ఏళ్ల వ్యక్తులను 25 ఏళ్ల నవ యువకులుగా మార్చేస్తానని నమ్మించిన ఓ జంట డజన్ల మంది వృద్ధుల నుంచి రూ. 35 కోట్లు కొట్టేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో జరిగిందీ ఘటన.
నగరానికి చెందిన రాజీవ్ కుమార్ దూబే, ఆయన భార్య రష్మీ దూబే కలిసి ‘రివైవల్ వరల్డ్’ పేరుతో థెరపీ సెంటర్ ప్రారంభించారు. ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన టైమ్ మెషీన్ సాయంతో 60 ఏళ్ల వృద్ధులను కూడా నవ యవ్వనం ఉట్టిపడేలా 25 ఏళ్ల వ్యక్తుల్లా మార్చేస్తామని ప్రచారం చేసుకున్నారు.
ఆక్సిజన్ థెరపీ ద్వారా యవ్వనాన్ని తిరిగి రప్పిస్తామని తమ కస్టమర్లకు హామీ ఇచ్చారు. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యం మీదపడుతోందని, ఆక్సిజన్ థెరపీ వల్ల నెల రోజుల్లోనే మార్పు వస్తుందని తమ కస్టమర్లను నమ్మించారు. 10 సెషన్లకు రూ. 6 వేలు, మూడేళ్ల రివార్డు సిస్టంకు అయితే రూ. 90 వేలు అని ప్యాకేజీలు ప్రకటించారు.
వారి వలలో పడి మోసపోయిన రేణుసింగ్ అనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘నవ యవ్వన’ మోసం బయటపడింది. తన నుంచి రూ. 10.75 లక్షలు వసూలు చేసి మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, వందలాదిమంది నుంచి దాదాపు 35 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంట కోసం గాలిస్తున్నారు. కాగా, వారు ఇప్పటికే దేశం వదిలి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.