BRS: డెబ్బై ఏళ్లుగా ఉంటున్న వారి నుంచి పన్నులు వసూలు చేసి... ఇప్పుడు కబ్జాదారులు అనవద్దు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు

BRS MLA welecomes All party meeting on HYDRA

  • హైడ్రా, మూసీ కూల్చివేతలపై అఖిలపక్ష సమావేశాన్ని స్వాగతించిన కృష్ణారావు
  • మూడు నెలల ముందే పెట్టి ఉంటే బుచ్చమ్మ చనిపోకపోయి ఉండేదన్న ఎమ్మెల్యే
  • ముఖ్యమంత్రిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

అరవై, డెబ్బై ఏళ్లుగా ఉంటున్న వారి నుంచి దశాబ్దాలుగా పన్నులు వసూలు చేసి ఇప్పుడు వారిని కబ్జాదారులు అనడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రా, మూసీ కూల్చివేతలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అఖిలపక్షం మూడు నెలల ముందే పెట్టి ఉంటే బుచ్చమ్మ అనే మహిళ చనిపోకపోయి ఉండేదన్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టాలని తాము గతంలోనే చెప్పామన్నారు.

హైదరాబాద్‌లో ఎన్ని చెరువులు ఉండేవి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. గతంలో కేటీఆర్ ఆదేశాల మేరకే చెరువులకు కంచె వేసినట్లు చెప్పారు. నల్ల చెరువు వద్ద పట్టాలు ఉన్న రైతులు హైకోర్టుకు వెళ్లడంతో కంచె తీయాల్సి వచ్చిందన్నారు.

నల్ల చెరువు, కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఉంటూ, పన్నులు కడుతూ ఉన్న వారిని కబ్జాదారులు అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రజల కంట నీరు రప్పించకుండా అభివృద్ధి చేయాలని సూచించారు. ఓ పద్ధతి ప్రకారం చేస్తే మూసీ ప్రక్షాళనకు కూడా తాము మద్దతిస్తామన్నారు.

  • Loading...

More Telugu News