Nandigam Suresh: ఏపీ హైకోర్టులో నందిగం సురేశ్‌కు భారీ ఊరట

Nandigam Suresh gets bail from AP HC

  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైల్లో ఉన్న సురేశ్ 
  • షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన హైకోర్టు 
  • సురేశ్‌తో పాటు విజయవాడ మాజీ మేయర్ భర్తకు బెయిల్

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నందిగం సురేశ్‌తో పాటు విజయవాడ మాజీ మేయర్ భర్తకు కోర్టు బెయిల్ ఇచ్చింది.

టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో సురేశ్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా కనిపించలేదు. ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వివరాలు సేకరించేందుకు సురేశ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో రెండు రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. నిన్నటితో రిమాండ్ ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. మరోవైపు, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News