Chandrababu: జగన్‌ను దెబ్బతీయలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అలా చేయాలి: చింతామోహన్

Chinta Mohan suggestion to Chandrababu and Pawan Kalyan

  • రాజకీయంగా ఎదుర్కోవడానికి జగన్ బెయిల్ రద్దయ్యేలా చూడాలని సూచన
  • శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతపై చంద్రబాబు మాట్లాడటం పద్ధతి కాదన్న చింతా మోహన్
  • చంద్రబాబుకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని ఆసక్తికర వ్యాఖ్య

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను దెబ్బతీయాలంటే ఆయన బెయిల్ రద్దయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ సూచించారు. అంతేకానీ, దేవాలయాలను, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగవద్దన్నారు. పవన్ కల్యాణ్ నిన్న తిరుపతిలో మాట్లాడిన తీరు సరికాదన్నారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతపై చంద్రబాబు మాట్లాడటం పద్ధతి కాదన్నారు. ఏదేమైనా దేవాలయాలను వివాదాల్లోకి తీసుకు రావొద్దని సీఎం, డిప్యూటీ సీఎంకు ఆయన సూచించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని... నెయ్యి స్థానంలో పామాయిల్ కానీ, వంటనూనె కానీ కలిపి ఉండవచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఉన్నంత లక్ ఎవరికీ లేదు

రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని, ఇప్పుడు కూడా దేశ రాజకీయాలు ఆయన చేతిలోనే ఉన్నాయని చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తనకు ఐదు దశాబ్దాలుగా తెలుసునని వెల్లడించారు. రాజకీయాల్లో ఆయన చాలా అదృష్టవంతుడు అన్నారు.

ప్రధాని మోదీతో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చంద్రబాబు ఆపవచ్చునని తెలిపారు. విశాఖ ఉక్కును రక్షించేది కేవలం చంద్రబాబు మాత్రమేనన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్టు అని విమర్శించారు.

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్నట్లుగా పోలవరంపై కూడా జరపాలని కోరారు. మోదీ ప్రభుత్వం ఎప్పుడైనా అధికారం కోల్పోవచ్చునని, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బహుశా కేంద్ర ప్రభుత్వం పడిపోతుందేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News