Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపణ
- ఈ ఆరోపణలు నిరాధారం, సత్యదూరమని పేర్కొన్న కేంద్ర మంత్రి కుమారస్వామి
- తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను 48 గంటల్లోనే విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఖండించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందించారు. గురువారం ఎక్స్ వేదికగానే కుమారస్వామి రిప్లై ఇచ్చారు. ఎన్డీఏ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తోందన్న ఆరోపణలు నిరాధారం, సత్యదూరమని ఆయన పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారన్న విషయం తన దృష్టికి వచ్చిన 48 గంటల్లోనే తిరిగి వారిని నియమించామని చెప్పారు. సెప్టెంబర్ 27న తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను 29న మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని పేర్కొన్నారు. స్వప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం మానండని కుమారస్వామి హితవు పలికారు. ఇప్పటి వరకూ రద్దు చేసిన 3,700 మంది కాంట్రాక్ట్ లేబర్ పాసులను ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా త్వరలో పునరుద్ధరిస్తామని ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం ఇప్పటికే స్పష్టంగా చెప్పిందన్నారు.
కార్మికుల బయోమెట్రిక్ డేటాను త్వరలో పునరిద్ధరిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న గేట్ పాస్ వ్యవస్థతో పాటు అవసరమైన సౌకర్యాలను కొనసాగించడానికి అన్ని పక్షాలూ చర్చల సమయంలో అంగీకరించాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎన్డీఏ సర్కార్ అమ్మేస్తోందని చేస్తున్న ఆరోపణలు నిరాధారం, సత్యదూరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలను సరిగా నిర్వహించడంతో గత మూడేళ్లలో వాటి షేర్ విలువ అద్భుతంగా పెరిగిందని కుమారస్వామి తెలిపారు.