gajjala venkata lakshmi: ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు

gajjala venkata lakshmi petition rejected

  • చైర్ పర్సన్ పదవి నుంచి వెంకటలక్ష్మిని తొలగించిన ప్రభుత్వం
  • ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన వెంకటలక్ష్మి
  • వెంకటలక్ష్మి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురయింది. తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను నిలుపుదల చేసి, ఆ పోస్టులో కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని వెంకటలక్ష్మి చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వెంకటలక్ష్మిని గత వైసీపీ ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చాలా మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వెంకటలక్ష్మి రాజీనామా చేయలేదు.

దీంతో కూటమి సర్కార్ ఆమెను తొలగిస్తూ మెమో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా అంతకు ముందు పని చేసిన వాసిరెడ్డి పద్మ పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేశారని.. ఆమె స్థానంలో మిగిలిన కాలానికి వెంకటలక్ష్మి నియమితులయ్యారని, ఈ ఏడాది ఆగస్టు 25తో ఆ పదవీ కాలం ముగియడంతో ఆమెను తొలగించడం జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు .. వెంకటలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం నిర్ణయాన్ని వెలువరించింది.

More Telugu News