Pawan Kalyan: రాముడు ఉత్తరాది దేవుడా? మన దేవుడు కాదా?: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Tirupati Varahi rally

  • తిరుపతిలో వారాహి సభ
  • హాజరైన పవన్ కల్యాణ్
  • మన దేశ మూల సంస్కృతికి శ్రీరాముడు వెన్నెముక అని వ్యాఖ్యలు 

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.

రామతీర్థంలో రాముడి తలనరికేస్తే ఏం చేశాం?... లోలోపలే తిట్టుకున్నాం... ఎందుకంటే, మన మాటలు ఎవరన్నా వింటే మనల్ని మతోన్మాదులు అనుకుంటారని భయం... అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళుతుంటారు... మనం భయంతో మాట్లాడం... ఈ దేశ మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు ఉత్తరాది దేవుడా? మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు... నీలమేఘచ్ఛాయలో ఉంటాడు, కృష్ణుడు నీలమేఘచ్ఛాయలో ఉంటాడు, కాళికాదేవి నల్లని రంగులో ఉంటుంది అని పవన్ వివరించారు.

"సనాతన ధర్మానికి వర్ణ వివక్ష లేదు. ఇవన్నీ మెకాలే తీసుకువచ్చిన రంగులు. కుహనా లౌకికవాదులకు ఒకటే చెబుతున్నా... మీ సిద్ధాంతాలను మాపై రుద్దకండి. అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరాముడి ప్రతిష్ఠాకార్యక్రమం జరుగుతుంటే దేశ ప్రతిపక్ష నేత 'నాచ్ గానా' కార్యక్రమం అని అవమానించారు... దీనిని ఏ హిందువు కూడా ప్రశ్నించరా? మన రాముడిపై వాళ్లు జోకులు వేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? రామాయణం కల్పవృక్షం అంటే... కాదు, అది విషవృక్షం అన్నారు... మరి మాకు కోపాలు రావా?" అంటూ పవన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

More Telugu News