Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదం: రేపు విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు

Supreme Court postpones hearing on Tirupati Laddu Row

  • శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి, తదితరులు
  • సుప్రీం పర్యవేక్షణలో విచారణ జరగాలన్న బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి
  • ఇవాళ ముఖ్యమైన కేసు విచారణ ఉందన్న సొలిసిటర్ జనరల్
  • లడ్డూ కేసును రేపు విచారించాలని సుప్రీంకు విన్నపం
  • సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తిని మన్నించిన అత్యున్నత న్యాయస్థానం

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. లడ్డూ వివాదంలో దాఖలైన పిటిషన్లపై రేపు (అక్టోబరు 4) విచారణ కొనసాగించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ నేడు మరో కేసును విచారించాల్సి ఉండడంతో, లడ్డూ కేసును శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు. 

ఇవాళ ఓ ముఖ్యమైన కేసు విచారణ ఉందని, లడ్డూ కేసు విచారణ కోసం ఆ కేసును ఆపడం సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఇవాళ మరో కేసుపై విచారణ చేపట్టాలని నిర్ణయించింది. లడ్డూ కేసును రేపటికి వాయిదా వేసింది. 

లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలంటూ ఇటీవల బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేయడం తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ వివాదంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్లపై సెప్టెంబరు 30న విచారణ జరిపిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 3కి వాయిదా వేసింది. అయితే, నేడు ఓ కీలకమైన కేసు ఉన్నందున లడ్డూ వ్యవహారంపై విచారణ సాధ్యపడలేదు.

  • Loading...

More Telugu News