Manchu Vishnu: మౌనంగా ఉండం.. మేమంతా ఏక‌మై నిల‌బ‌డ‌తాం: మంచు విష్ణు

Manchu Vishnu Tweet on Konda Surekha Comments

  • మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గు మంటున్న టాలీవుడ్‌
  • ఇప్ప‌టికే చిరు, నాగార్జున, వెంకటేశ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని ఫైర్‌
  • తాజాగా ఎక్స్ వేదిక‌గా స్పందించిన 'మా' అధ్య‌క్షుడు విష్ణు
  • త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌ను ప్ర‌జా చ‌ర్చ‌ల్లోకి లాగొద్దంటూ ట్వీట్‌

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు చిత్ర సీమ భగ్గు మంటోంది. అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని ఆగ్ర‌హానికి గురి చేస్తున్నాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, జూనియ‌ర్‌ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, సుధీర్ బాబు, సమంత, నాగా చైతన్య, అమల, అఖిల్, ఖుష్బూ, సుశాంత్ ఇలా అందరూ కూడా మంత్రి సురేఖ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా 'మా' అధ్య‌క్షుడు మంచు విష్ణు కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించేందుకు న‌టుల పేర్లు, వారి కుటుంబాల పేర్ల‌ను వాడొద్ద‌ద‌న్నారు. త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌ను ప్ర‌జా చ‌ర్చ‌ల్లోకి లాగొద్ద‌ని విష్ణు పేర్కొన్నారు. అంద‌రూ ఒకరినొకరు గౌరవించుకోవాలి అని తెలిపారు. ఇలా మా ప్రెసిడెంట్ హోదాలో ఆయ‌న‌ ఓ సుదీర్ఘమైన లేఖ‌ను పోస్ట్‌ చేశారు. 

"సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ, ఇతర రంగాలవలే, పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది.

మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం, లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్దపు ఆరోపణలలోకి లాగబడటం ఇష్ట పడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.

రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయ కథ‌నాల కోసం లేదా ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లు వాడకండి.

మేము, చిత్రపరిశ్రమలో పనిచేసేవారు సమాజానికి వినోదం ఇవ్వడానికి, సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలలోకి లాగకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాల పైన వచ్చే అబద్ధపు కథనాల వలన కలిగే బాధ చాలా తీవ్రమైంది. 

ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలని బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం. పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతామ" అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News