Israel: పెళ్లి సంబరానికి అడ్డంకుల్లేవ్.. పైన ఇరాన్ బాంబుల వర్షం.. బంకర్‌లో ఇజ్రాయెల్ జంట డ్యాన్స్.. వీడియో ఇదిగో!

Iran Couldnt Stop The Joy  Newlyweds Dancing In Bunker As Missiles Rain Down On Israel

  • జెరూసలెంలో వివాహం చేసుకున్న అమెరికా జంట
  • వారి వివాహాన్ని క్షణకాలం కూడా ఆపలేకపోయిన ఇరాన్ బాంబులు
  • దుమ్ముతో కూడిన బంకర్‌లో అతిథుల మధ్య డ్యాన్స్

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాలు ఒకరిపై ఒకరు బాంబులు కుమ్మరించుకుంటున్నా ఓ జంట వివాహాన్ని, వారి ఆనందాన్ని క్షణకాలం పాటు కూడా ఆపలేకపోయాయి. ప్రపంచం మునిగిపోతే పోనీ.. తమకేం సంబంధం లేనట్టు, అసలీ ప్రపంచంతోనే తమకు సంబంధం లేనట్టు ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో ఓ జంట పెళ్లితో ఒక్కటైంది. ఆపై బంకర్‌లో ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ.. డ్యాన్స్ చేస్తూ మైమరచిపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 అమెరికాలోని కొలరాడోకు చెందిన క్రిస్టిరే-షాన్ గిబ్సన్ పెళ్లి చేసుకునేందుకు జెరుసలెం చేరుకున్నారు. అయితే, మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించి భయోత్పాతం సృష్టించింది. దీంతో ఈ జంట వివాహానంతరం అతిథులతో కలిసి హోటల్ షెల్టర్‌కు మారాల్సి వచ్చింది. నిజానికి తాము గతేడాది అక్టోబర్ 7నే ఇజ్రాయెల్ రావాలని అనుకున్నామని కానీ, అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఆ జంట గుర్తు చేసుకుంది. 

కాగా, పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట ఇరుకుగా, దుమ్ముతో నిండిన బంకర్‌లో అతిథుల మధ్య డ్యాన్స్ చేస్తూ ఆనందం అనుభవించారు. వారి నృత్యాన్ని బంధువులు కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే వైరల్ అయింది. ఇప్పటికే 2.3 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఈ వీడియోను షేర్ చేసిన బైబిల్ స్కాలర్, రచయిత సౌల్ సద్కా.. జెరూసలెంలో వివాహ వేడుకలో ఆనందాన్ని ఇరాన్ ఒక్క క్షణం కూడా ఆపలేకపోయిందని రాసుకొచ్చారు. చాలామంది యూజర్లు ఈ కొత్త జంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతున్నారు. పై బాంబుల మోత మోగుతున్నా కింద వీరు ఏమాత్రం బెదరకుండా ఆనందంగా నృత్యం చేయడాన్ని కొందరు ప్రశంసించారు.

  • Loading...

More Telugu News