Viral News: విడాకులు ఇవ్వడం ఇష్టంలేక కోర్ట్ రూమ్ నుంచి భార్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసిన భర్త

A dramatic scene unfolded in a Chinese courtroom when a man carried his wife out to avoid divorce

  • చైనాలోని ఓ కోర్టులో చోటుచేసుకున్న నాటకీయ ఘటన
  • మద్యం మత్తులో భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ విడాకులు కోరిన భార్య
  • విడాకులు వొద్దు.. మారతానని చెబుతున్న భర్త
  • రెండోసారి అప్పీల్‌కు వెళ్లగా కోర్ట్ రూమ్ నుంచి భార్యను భుజాన వేసుకొని పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమైన భర్త
  • మందలించిన న్యాయస్థానం.. పునరావృతం కానివ్వబోనని భర్త హామీ

గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేక ఎవరూ ఊహించని పనికి పాల్పడ్డాడు. కోర్ట్ రూమ్‌లో ఉన్న తన భార్యను భుజంపై వేసుకొని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. చైనాలోని ఓ కోర్టులో ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. విడాకులను అడ్డుకునేందుకు లీ అనే వ్యక్తి ఈ విధంగా వ్యవహరించాడు. భార్య చెన్‌ను బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం పేర్కొంది.

తన భర్త లీ గృహ హింసకు పాల్పడుతున్నాడని భార్య చెన్ చెబుతోంది. మద్యం తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. అయితే చెన్ తొలి అప్పీల్ సమయంలో వాదనలు విన్న న్యాయస్థానం విడాకుల ఇచ్చేందుకు నిరాకరించింది. దంపతుల మధ్య 20 ఏళ్ల వైవాహిక భావోద్వేగ బంధం ఉందని, విడిపోయేందుకు భర్త లీ అయిష్టంగా ఉండడంతో వీరిద్దరి మధ్య సయోధ్యకు అవకాశం ఉందని, అందుకే విడాకులు నిరాకరిస్తున్నట్టు కోర్ట్ తెలిపింది.

పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడంతో భార్య చెన్ రెండవసారి విడాకుల కోసం అప్పీల్ చేసింది. అయితే భార్య నుంచి విడిపోకూడదనే భావనలు భర్త లీలో మరింత బలపడ్డాయి. దీంతో విచారణ సమయంలో భావోద్వేగానికి గురైన లీ.. భార్య చెన్‌ను భుజంపై వేసుకొని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. భార్య అరుస్తున్నా అతడు పట్టించుకోలేదు. అయితే కోర్ట్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని లీని మందలించారు. దీంతో ఇలాంటి తప్పులు పునరావృతం చేయబోనంటూ లీ లిఖితపూర్వకంగా కోర్టుకు హామీ ఇచ్చాడు.

‘‘విడాకులు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న భావోద్వేగంతో ఈ పొరపాటు చేశాను. ఉద్వేగంలో ఉండడంతో నా తీవ్ర చర్యను ఆపడానికి న్యాయమూర్తులు, కోర్టు అధికారులు ప్రయత్నించినా నేను పట్టించుకోలేదు. భార్యను కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్లాను. నా తప్పు తీవ్రతను, ప్రతికూల ప్రభావాన్ని నేను గ్రహించాను. భవిష్యత్తులో ఈ తప్పును పునరావృతం చేయబోనని హామీ ఇస్తున్నాను’’ అని అతడు పేర్కొన్నాడు.

ఇక ఈ అంశానికి కొసమెరుపు ఏమిటంటే, ఆశ్చర్యకరంగా దంపతులు విడాకులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. గృహహింస పెడుతున్నాడని ఫిర్యాదు చేసినప్పటికీ.. 20 ఏళ్ల వైవాహిక జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని భర్త లీకి మరో అవకాశం ఇవ్వాలని భార్య చెన్ నిర్ణయించుకుంది. దీంతో ఇద్దరూ యథావిధిగా దాంపత్య జీవితాన్ని కొనసాగించబోతున్నారు. కాగా సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఈ దంపతులకు 20 ఏళ్లక్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News