Shardul Thakur: ఆసుప‌త్రిలో చేరిన టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌!

Shardul Thakur rushed to Lucknow hospital soon after dismissal in Irani Cup batted despite 102 degrees fever

  • ల‌క్నో వేదిక‌గా ముంబ‌యి, రెస్టాఫ్ ఇండియా మ్యాచ్‌
  • 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్ చేసిన ముంబ‌యి ప్లేయ‌ర్‌ శార్దూల్ ఠాకూర్‌
  • మ్యాచ్ త‌ర్వాత ల‌క్నోలోని ఆసుప‌త్రికి త‌ర‌లింపు
  • ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్న మెడిక‌ల్ టీమ్‌  

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరాడు. రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ముంబ‌యి ఆల్‌రౌండ‌ర్‌కు ల‌క్నోలోని ఓ స్థానిక ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తెలిపింది. కాగా, 102 డిగ్రీల జ్వరంతో బాధ‌ప‌డుతూనే బుధ‌వారం ఇరానీ క‌ప్‌లో భాగంగా ల‌క్నో వేదిక‌గా రెస్టాఫ్ ఇండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబ‌యి త‌ర‌ఫున ఆడాడు. అజేయ ద్విశ‌త‌కంతో మెరిసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌తో క‌లిసి శార్దూల్ (36)  తొమ్మిదో వికెట్‌కు 73 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించాడు. 

మ్యాచ్‌ మొదటి రోజే శార్దూల్‌ తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే, రెండో రోజు (బుధ‌వారం) దాదాపు రెండు గంటలపాటు బ్యాటింగ్ చేసిన తర్వాత అతని ఆరోగ్య‌ పరిస్థితి మరింత దిగజారింది. దాంతో ఈ ఆల్ రౌండర్ ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో రెండుసార్లు విరామం తీసుకోవలసి వచ్చింది.

జ్వ‌రంతోనే బ్యాటింగ్ చేసి ఆట‌పై త‌న‌కు ఉన్న ప్రేమ‌ను చాటాడు. ఇక శార్దూల్‌ ఇన్నింగ్స్ ముగిసిన వెంట‌నే ముంబ‌యి టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. రాత్రి అక్క‌డే వైద్యుల బృందం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించింది. ఇప్ప‌టికే అత‌నికి మలేరియా, డెంగ్యూ వంటి జ్వ‌రాల‌కు సంబంధించిన‌ వైద్య పరీక్షలు నిర్వహించారు.

More Telugu News