Israel: బీరుట్‌ నడిబొడ్డున ఇజ్రాయెల్ దాడులు.. తీవ్ర ఉద్రిక్తత

IDF strikes central Beirut for the first time since 2006

  • లెబనాన్ పార్లమెంట్ భవనానికి సమీపంలో దాడి జరిపిన ఇజ్రాయెల్  
  • నగర శివార్లలోనూ దాడులు
  • 2006 తర్వాత బీరుట్ నగరంలో ఇజ్రాయెల్ దాడులు జరపడం ఇదే

హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌లో మరోసారి దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. గురువారం ఉదయం రాజధాని బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడి జరిపాయి. సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్న ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపినట్టు తెలుస్తోంది. బచౌరా ప్రాంతంలో జరిగిన ఈ దాడి లెబనాన్ ప్రభుత్వాన్ని నిర్వహించే ప్రదేశానికి దగ్గరలోనే జరగడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది.

బీరుట్‌పై కచ్చితమైన వైమానిక దాడిని జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. భారీ పేలుడు శబ్దాలు విన్నామని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బీరుట్ నగర దక్షిణ శివారు ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ముందుగా హెచ్చరికలు జారీ చేసిన అనంతరం పలు దాడులు జరిగాయి. అయితే సెంట్రల్ బీరుట్‌లో జరిగిన దాడి విషయంలో మాత్రం ఇజ్రాయెల్ బలగాలు హెచ్చరికలు చేయలేదు. కాగా బీరుట్ నగరంలో ఇజ్రాయెల్ దాడులు జరపడం 2006 తర్వాత ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలావుంచితే, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరో వీడియోను విడుదల చేశారు. ‘‘ప్రపంచ స్థిరత్వానికి హానికరమైన ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న కష్టతరమైన యుద్ధంలో పతాక స్థితిలో ఉన్నాం. ఇరాన్ మనల్ని నాశనం చేయాలనుకుంటోంది. కానీ అది జరగదు. మనమంతా కలిసి నిలబడతాం. దేవుడి సాయంతో కలసి కట్టుగా గెలుస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా నిన్న (బుధవారం) ఇజ్రాయెల్‌కు చెందిన 8 మంది సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News