Devara: మరోసారి వాయిదా పడిన 'దేవర' వేడుక?

Devara ceremony postponed once again

  • గుంటూరులో జరగాల్సిన థ్యాంక్స్‌ మీట్‌ 
  • అనుకోని కారణాలతో వాయిదా 
  • ఈ వారంలోనే మరో డేట్‌లో వేడుక

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'దేవర'. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో కాస్త మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా, కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రం ప్రారంభ వసూళ్లు ఊహించిన దానికంటే చాలా బెటర్‌గా వున్నాయి. దేవర, వర ప్రాతల్లో ఎన్టీఆర్‌ అభినయానికి, ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. దసరా సెలవులు ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ అడ్వాంటేజీగా మారాయి. రానున్న వారంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల లేకపోవడం కూడా 'దేవర'కు కలిసొచ్చే అంశం. 

ఇక విడుదలకు ముందు అన్ని ఏర్పాట్లతో జరగాల్సిన 'దేవర' ప్రీ రిలీజ్‌ వేడుక చివరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరగాల్సిన ఈ వేడుకకు పరిమితికి మించిన ఫ్యాన్స్‌ రావడం, వేదిక వద్ద తోపులాట చోటుచేసుకోవడం, చివరకు ఉద్రిక్తతకు దారితీయడంతో... తప్పనిసరి పరిస్థితులలో వేడుకను క్యాన్సిల్‌ చేశారు నిర్వాహకులు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తరలి వచ్చిన ఎన్టీఆర్‌ అభిమానులు డిజప్పాయింట్‌ అయ్యారు. అయితే ఈ స్థానంలో సినిమా విడుదల తరువాత మరో వేడుకను భారీగా ప్లాన్‌ చేద్దామని అనుకున్నారు మేకర్స్‌.  

విడుదల తరువాత సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడం, వసూళ్లు కూడా భారీగా వుండటంతో 'దేవర' థ్యాంక్స్‌ మీట్‌ను గుంటూరులోని నంబూరు దగ్గర గ్రౌండ్‌లో అక్టోబర్‌ 3న నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్‌ చేశారని తెలిసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాజాగా థ్యాంక్స్‌ వేడుక కూడా వాయిదా వేశారని సమాచారం. పోలీసుల అనుమతి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది. అయితే ఈ వారంలోనే ఈ వేడుకను జరపాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Devara
Devara thanks meet
Ntr
Devara pressmeet
Koratala Siva
Tollywood
  • Loading...

More Telugu News