Bombay High Court: తల్లిని చంపేసి.. శరీర భాగాలను తినేసిన వ్యక్తికి మరణ శిక్ష!

Bombay High Court Confirms Death Penalty For Man Who Killed Mother Ate Body Parts

  • ఇది నరమాంస భక్షక కేసు అని పేర్కొన్న న్యాయ‌స్థానం
  • 2017లో తల్లిని చంపేసి, కొన్ని శరీర భాగాలను తినేసిన సునీల్‌ కుచ్‌కోరవి
  • అత‌నికి 2021లో మరణ శిక్ష విధించిన కొల్హాపూర్‌ కోర్టు
  • తాజాగా ఆ తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు

2017లో తల్లిని చంపేసి, కొన్ని శరీర భాగాలను తినేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఇది నరమాంస భక్షక కేసు అని పేర్కొంది. 

న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ దోషి సునీల్ కుచ్‌కొరవికి మరణశిక్షను నిర్ధారిస్తున్నట్లు తెలిపింది. "కేసు అరుదైన కేటగిరీ కిందకు వస్తుంది. దోషి తన తల్లిని హత్య చేయడమే కాకుండా ఆమె శరీర భాగాలైన మెదడు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, పేగులను కూడా తొలగించి పెనంపై కాల్చాడు. వాటిలో కొన్నిటిని తినేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇది నరమాంస భక్షక కేసు" అని బాంబే హైకోర్టు పేర్కొంది.

నరమాంస భక్షక ధోరణులు ఉన్నందున నేరస్థుడిని సంస్కరించే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది. అత‌నికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లయితే, అతను జైలులో కూడా ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది. అందుకే అత‌నికి కింది కోర్టు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌ను స‌మ‌ర్థిస్తున్నామ‌ని న్యాయ‌స్థానం చెప్పుకొచ్చింది. కాగా, కుచ్‌కోరవికి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కోర్టు నిర్ణ‌యాన్ని తెలియ‌జేశారు.

దోషి సునీల్‌ కుచ్‌కోరవి 2017 ఆగస్ట్‌ 28న కొల్హాపూర్‌లోని నివాసంలో తన 63 ఏళ్ల తల్లి యల్లమ రామ కుచ్‌కోరవిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని కోసి, కొన్ని అవయవాలను బ‌య‌ట‌కు తీసి పెనంపై కాల్చాడు. వాటిలో కొన్నిటిని తినేశాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు. 

దీంతో అత‌నికి కొల్హాపూర్‌ కోర్టు 2021లో మరణ శిక్ష విధించింది. ప్ర‌స్తుతం అతను పుణేలోని యెరవాడ జైలు ఉన్నాడు. తనకు కింది కోర్టు మరణ శిక్ష విధించడంపై సునీల్‌ కుచ్‌కోరవి అప్పీల్‌ చేశాడు. హైకోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చి, మరణ శిక్షను సమర్థించింది.

  • Loading...

More Telugu News