PM Modi: రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా!
- అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
- స్టెంట్ అమర్చిన వైద్యులు
- ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
- లతా రజనీకాంత్‌కు ఫోన్ చేసి సూపర్ స్టార్ ఆరోగ్యంపై ఆరా తీసిన మోదీ
- ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా పంచుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని, దాంట్లో స్టెంట్ అమర్చినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాయి. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి.
ఇక సూపర్ స్టార్ ఆసుపత్రిలో చేరడంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై స్పందించారు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా రజనీ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన భార్య లతా రజనీకాంత్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు.
ఈ మేరకు అన్నామలై ఓ ట్వీట్ చేశారు. "సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి పీఎం మోదీ ఈరోజు లతా రజనీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చికిత్స జరిగిన తర్వాత ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు" అని అన్నామలై తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ప్రధాని మోదీతో కలిసి ఉన్న రజనీకాంత్ ఫొటోను ఆయన జోడించారు.
ఇక అంతకుముందు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, విశ్వనటుడు కమల్ హాసన్, మరో స్టార్ నటుడు విజయ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా లతా రజనీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.