Botsa Satyanarayana: అందుకే లులూకు ప్రత్యామ్నాయంగా ఇనార్బిట్ మాల్ తీసుకువచ్చాం: బొత్స

botsa satyanarayana react on lulu group investments in andhra pradesh

  • 1200 కోట్ల విలువైన స్థలంలో 600 కోట్ల పెట్టుబడి పెడతామన్నారన్న మాజీ మంత్రి బొత్స 
  • లులూకు ప్రత్యామ్నాయంగా ఇనార్బిట్ మాల్ తీసుకువచ్చామని వెల్లడి
  • ఎన్నో హామీలు ఇచ్చారని, అవి నెరవేర్చండని సూచించిన బొత్స

అంతర్జాతీయ వాణిజ్య సంస్థ లులూ గ్రూపు మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ సంస్థ చైర్మన్, ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విశాఖతో పాటు విజయవాడ, తిరుపతిలో మాల్స్, మల్టీ ప్లెక్స్‌ ల నిర్మాణం, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వెళ్లిన తర్వాత లులూ గ్రూపు చైర్మన్, ఎండీ యూసుఫ్ అలీ ..విశాఖలో అంతర్జాతీయ స్థాయిలో మాల్ ఏర్పాటు చేయనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. చంద్రబాబుతో సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగిందని పేర్కొన్న ఆయన విజయవాడ, తిరుపతిలోనూ హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మిస్తామని వెల్లడించారు. 

తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. లులూ కంపెనీలు మళ్లీ విశాఖ వస్తున్నాయని హడావుడి చేస్తున్నారన్నారు. లులూ మొదట ఆర్కే బీచ్ రోడ్డులో 1200 కోట్ల విలువ చేసే భూముల్లో 600 కోట్ల పెట్టుబడి పెడతామన్నారని, అందుకే ఆలోచించాల్సి వచ్చి వద్దన్నామని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చామని బొత్స తెలిపారు. వైసీపీ హయాంలో ఎన్నో మంచి పనులు చేశామని అన్నారు. ఎక్కడో చిన్న చిన్న తప్పులకు ప్రజలు వారికి ప్రభుత్వాన్ని అప్పగించారని వ్యాఖ్యానించారు. ఎన్నో హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చండని కూటమి ప్రభుత్వానికి బొత్స సూచించారు.

More Telugu News