New Liquor Policy: నూతన మద్యం పాలసీ ప్రక్రియ ప్రారంభమైంది: ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్

AP Govt new liquor policy procedure has started

  • ఏపీలో కొత్త మద్యం విధానం అమలుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు
  • అక్టోబరు 12 నుంచి నూతన మద్యం పాలసీ అమలు!
  • బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లకు అనుమతి లేదన్న కమిషనర్
  • ఎంఆర్ పీ ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిక

ఏపీలో అక్టోబరు 12 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ వివరాలు తెలిపారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. ఈ కొత్త మద్యం పాలసీ 2026 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు. 

ఎంఆర్ పీ ధరల కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్మిట్ రూమ్ లు, బెల్ట్ షాపులకు అనుమతి లేదని నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. మద్యం షాపులపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. స్కూళ్లు, ఆలయాలకు 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోమని వెల్లడించారు. 

మద్యం లైసెన్స్ దక్కించుకున్న వారు, దుకాణంలో రెండు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. నూతనంగా ఏర్పాటయ్యే మద్యం దుకాణాల్లో నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని కమిషనర్ వివరించారు. 

ఈ నెల 12 నుంచి నూతన మద్యం విధానం అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు పాత విధానమే అమల్లో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి న్యాయం చేయాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 

ఇక, కొత్త మద్యం విధానం వల్ల సిండికేట్ అయ్యే అవకాశం ఉండదని నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. 2017లో ఒక మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు సగటున 18 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పుడు అంతకంటే ఎక్కువే రావొచ్చని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News