Nadendla Manohar: ఏపీలో 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు నేటి నుంచి కందిపప్పు, పంచదార

AP govt distributes Toor dall and Sugar to ration card holders

  • కందిపప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రి నాదెండ్ల
  • కందిపప్పు కిలో రూ.67, పంచదార అర్ధ కిలో రూ.17 అని వెల్లడి
  • నిత్యావసరాలు అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టీకరణ 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ ఈ రోజు నుంచి కందిపప్పు, పంచదార కూడా ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కందిపప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. 

ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్ధ కిలో అందిస్తామని తెలిపారు. కిలో కందిపప్పు ధర రూ.67, అర్ధ కిలో పంచదార రూ.17గా నిర్ణయించామని చెప్పారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. నిత్యావసరాలు అందుబాటు ధరల్లో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

"కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు నిత్యవసరాలు అందుబాటు ధరల్లో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో రెండుమార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశాం. రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం రూ.150కి, బియ్యం (స్టీమ్డ్ – బీపీటీ/సోనా మసూరి) రూ.48, బియ్యం (పచ్చి – బీపీటీ/సోనా మసూరి) రూ.47కి విక్రయించేలా చర్యలు తీసుకున్నాం. 

ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇటీవల సంభవించిన వరదల సమయంలో బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు అందించాం” అని వివరించారు.

More Telugu News