Raghunandan Rao: కొండా సురేఖ మీద అభ్యంతరకర పోస్ట్‌పై తీవ్రంగా స్పందించిన రఘునందన్ రావు

Raghunandan Rao warning to BRS over post on Konda Surekha

  • అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా విచారం వ్యక్తం చేస్తున్నానన్న బీజేపీ ఎంపీ
  • ఇలాంటి వారిని జైలుకు పంపించే వరకు తమ్ముడిగా అండగా ఉంటానని హామీ
  • హరీశ్ రావు, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

మంత్రి కొండా సురేఖ మీద సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. తన వల్ల కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి వారిని జైలుకు పంపించే వరకు తమ్ముడిగా అండగా ఉంటానన్నారు.

అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈ అంశంపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు.

కొండా సురేఖపై ట్రోలింగ్ జరగడంపై హరీశ్ రావు ఒక ట్వీట్ పెట్టి వదిలేయడం కాదని, క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. అధికారిక కార్యక్రమంలో ఓ మంత్రిని గౌరవపూర్వకంగా సన్మానిస్తే ఇంత దారుణంగా పోస్టులు పెట్టడమేమిటని నిలదీశారు. 

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా వేదికపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎంపీగా తాను ఉన్నానని గుర్తు చేశారు. వేలాదిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాన్ని అభ్యంతరకరంగా చూపించడం బాధాకరమన్నారు. 

బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మీ పార్టీ సోషల్ మీడియా కోసం చాలామందిని నియమించుకొని తప్పుడు పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి తప్పుడు రాతలు, వెకిలి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా మహిళా నాయకులను కించపరిచే ప్రయత్నం చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించవలసి వస్తుందని కేటీఆర్‌ను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News