Chandrababu: ఎక్కువమంది ఎంపీలను గెలిపించి మంచి పనిచేశారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu commebnts on Jagan in pension distribution program

  • నేడు కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం
  • గ్రామసభలో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు
  • చెయ్యరాని పాపాలు, చెయ్యరాని తప్పులు చేశాడని వ్యాఖ్యలు
  • ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ (అక్టోబరు 1) కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. జగన్ వెళుతూ వెళుతూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారని ఆరోపించారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. 

కానీ ప్రజలు ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో ఓట్లు వేసి కూటమికి విజయం అందించారని కొనియాడారు. కూటమి తరఫున ఎక్కువమంది ఎంపీలను గెలిపించి మంచి పని చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ రూ.4 వేలు చేశామని, ఇప్పుడు ఒకటో తేదీ నాడే అధికారులు మీ ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పెన్షన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

ఇప్పుడు ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని, ఇక నుంచి జీతాల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. 

అతడిని (జగన్) తాను పాబ్లో ఎస్కొబార్ తో పోల్చుతుంటానని, ఎస్కొబార్ పెద్ద స్మగ్లర్ అని, అమెరికాకు మత్తుపదార్థాలు స్మగ్లింగ్ చేసేవాడని వెల్లడించారు. ఎవరైనా ఎదురుతిరిగితే వివేకానందరెడ్డి మాదిరిగా ఎగిరిపోయేవాళ్లని వ్యాఖ్యానించారు. ఎస్కొబార్ ఇలాంటివి ఎన్నో చేసేవాడని, ఇతను (జగన్) కూడా ఎస్కొబార్ లాంటి వ్యక్తి అని చంద్రబాబు విమర్శించారు. 

తన జీవితంలో అనేకమంది రాజకీయనేతలను చూశాను కానీ, ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎక్కడా చూడలేదని అన్నారు. సొంత బాబాయ్ నే లెక్కలోకి తీసుకోని వ్యక్తి... మిమ్మల్ని, నన్ను లెక్కలోకి తీసుకుంటాడా అని వ్యాఖ్యానించారు. ఇతను చెయ్యరాని పాపాలు చేశాడని, చెయ్యరాని తప్పులు చేశాడని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. అయితే ఆ పాపాలు ప్రజల పట్ల శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News