Sachin Tendulkar: క్రికెట్ మైదానంలో మళ్లీ అడుగుపెట్టబోతున్న సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar is all set to make a return to the cricketing field in International Masters League

  • ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో పాల్గొననున్న మాస్టర్ బ్లాస్టర్
  • లీగ్‌లో పాల్గొననున్న ఆరు దేశాల జట్లు
  • భారత్ వేదికగా జరగనున్న టోర్నీ
  • మైదానంలో మరోసారి మెరవనున్న రిటైర్డ్ ఆటగాళ్లు

కోట్లాది క్రికెట్ అభిమానుల ఆరాధ్య దైవం, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. భారత్ వేదికగా జరగనున్న ‘ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్’ ఆరంభ ఎడిషన్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ సచిన్ ఆడడం ఖాయమైంది. అంతేకాదు ఈ లీగ్ అంబాసిడర్‌గా కూడా సచిన్ వ్యవహరించనున్నాడు.

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్లు తిరిగి తమ దేశాల తరపున ఆడనున్నారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ముంబై, లక్నో , రాయ్‌పూర్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.

ఈ లీగ్‌పై సచిన్ మాట్లాడుతూ.. క్రికెట్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని అన్నాడు. గత దశాబ్ద కాలంలో టీ20 క్రికెట్‌కు ఎనలేని ఆదరణ పెరిగిందని, కొత్త అభిమానులను ఆకర్షించిందని అభిప్రాయపడ్డాడు. పాతకాలం నాటి స్టార్లు కొత్త ఫార్మాట్‌ క్రికెట్‌లో (టీ20) చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని అన్నాడు.

నిజానికి క్రీడాకారులు మనస్ఫూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించరని సచిన్ వ్యాఖ్యానించాడు. మైదానంలో తిరిగి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తుంటారని, ‘అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్‌’లో అభిమానుల మధ్య అంతా ఆడబోతున్నామని చెప్పాడు. ఈ లీగ్ పాత క్రికెటర్ల కలయికగా భావిస్తున్నానని, మాజీ స్టార్లు అందరూ తిరిగి మైదానంలోకి వస్తారని ఆశిస్తున్నట్టు సచిన్ చెప్పాడు.

కాగా ఇంటర్నేషల్ మాస్టర్స్ లీగ్‌కు సచిన్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండగా.. సునీల్ గవాస్కర్ లీగ్ కమిషనర్‌గా నియమితులయ్యారు. కాగా ఈ లీగ్ రూపంలో పాత తరం క్రికెటర్ల ఆటను అభిమానులు మరోసారి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించిందని గవాస్కర్ వ్యాఖ్యానించారు. మాజీ ఆటగాళ్లు అందరినీ ఆహ్వానిస్తున్నాని, కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవాలని కోరుతున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News