Israel: లెబనాన్‌లో క్షేత్రస్థాయి దాడులు షురూ చేసిన ఇజ్రాయెల్ సేనలు

Israel said troops had begun limited raids against Hezbollah targets in the border area

  • లెబనాన్ సరిహద్దు గ్రామాల్లోని హిజ్బుల్లా మౌలిక వసతులను ధ్వంసం చేస్తున్న బలగాలు
  • పరిమితంగా లక్షిత దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటన
  • తమ దేశ సరిహద్దు ప్రాంత ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతోనే దాడులు చేస్తున్నట్టు వెల్లడి

లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలపై దాడులను ఇజ్రాయెల్ సేనలు మరింత తీవ్రతరం చేశాయి. మంగళవారం ఉదయం క్షేత్రస్థాయి దాడులను సైతం మొదలుపెట్టాయి. సరిహద్దు ప్రాంతంలోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పరిమిత స్థాయి దాడులు మొదలుపెట్టినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది. తమ దేశ సరిహద్దుకు సమీపంలో ఉండే దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హిజ్బుల్లా మౌలిక వసతులను ధ్వంసం చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

ఉత్తర ఇజ్రాయెల్‌లోని తమ దేశ పౌరులకు తక్షణ ముప్పు పొంచి ఉందని, అందుకే సరిహద్దుకు దగ్గరగా ఉన్న దక్షిణ లెబనాన్ గ్రామాలలో హిజ్బుల్లాపై ‘పరిమితంగా, స్థానికంగా, లక్షిత’ దాడులు చేస్తున్నట్టు పేర్కొంది. కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో వివరించింది. క్షేత్రస్థాయిలో దాడులు చేపడుతున్న బలగాలకు వైమానిక దళం, ఫిరంగిదళాలు సాయం అందిస్తున్నాయని వెల్లడించింది.

కాగా భారీగా బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని, హెలికాప్టర్లు, డ్రోన్ల కింద నుంచి ప్రయాణిస్తున్నాయని లెబనీస్ సరిహద్దు పట్టణం ఐతా అల్-షాబ్‌ ప్రజలు చెబుతున్నారు. ఇక మరో సరిహద్దు పట్టణం ఆర్మీష్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు మరింత విస్తృతమయ్యాయి.

కాగా లెబనాన్‌లో తదుపరి దశ దాడులు త్వరలో ప్రారంభమవుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ సోమవారమే ప్రకటించారు. మరోవైపు హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని గ్రూప్ డిప్యూటీ లీడర్ నయీమ్ ఖాస్సేమ్ సోమవారం ప్రకటించాడు. నస్రల్లా మరణం తర్వాత అతడు సోమవారం తొలిసారి బహిరంగంగా మాట్లాడాడు. ప్రతిఘటన ఉంటుందని, సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News