Election Commission: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్
- అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తేదీ వరకూ ఓటు నమోదు చేసుకోవాలన్న ఈసీ
- నవంబర్ 23న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన
- డిసెంబర్ 30న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా ప్రచురణ
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలోని పట్టభద్రులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తేదీ వరకూ తమ ఓటును నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది. ఓటర్ల ముసాయిదా జాబితాను నవంబర్ 23న ప్రకటిస్తారు. డిసెంబర్ 9వరకు అభ్యంతరాలు స్వీకరించి అదే నెల 30న తుది జాబితాను వెల్లడిస్తారు. ఇక ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదుకు సంబంధించి ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం ఫారమ్ 18 సమర్పించాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలో నివసించే వారందరూ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరుగా తమ ఓటును నమోదు చేసుకోవడానికి అర్హులు. గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేసినప్పటికీ ఆధార్‌లో ఉన్న అడ్రస్ ఆధారంగా తమ ఓటును నమోదు చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే అధికారులు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు మాత్రం దరఖాస్తుదారుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది.