Indian Air Force: 56 ఏళ్లక్రితం కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం.. ఇప్పుడు లభ్యమైన 4 మృతదేహాలు

More than 56 years after an aircraft crash four bodies of victims were recovered

  • హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ పాస్‌పై కూలిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-12 విమానం
  • విమానంలో ప్రయాణించిన 102 మంది సిబ్బంది
  • మంచుతో కప్పి ఉండే కఠిన పరిస్థితుల్లో నాటి నుంచి కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

దాదాపు 56 ఏళ్లక్రితం హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ పాస్‌పై భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-12 విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఆ ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలు ఇప్పుడు బయటపడ్డాయి. దీంతో భారత్ కు సుదీర్ఘకాలంగా జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్‌లో గణనీయమైన విజయం లభించినట్టయింది. డోగ్రా స్కౌట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, తిరంగా మౌంటెన్ రెస్క్యూకు చెందిన సిబ్బంది ఉమ్మడిగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మృతదేహాలను కనుగొన్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 7, 1968న చండీగఢ్ నుంచి లేహ్‌ వెళ్తున్న ట్విన్-ఇంజిన్ టర్బోప్రాప్ ట్రాన్స్‌పోర్ట్ విమానం ‘ఏఎన్-12’ అద‌ృశ్యమైంది. అందులో 102 మంది ప్రయాణించారు. మంచుతో కప్పి ఉండే ఆ ప్రాంతంలో విమానం శకలాలు, మృతుల అవశేషాల కోసం ఆ నాటి నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌కు చెందిన పర్వతారోహకులు విమానం శిథిలాలను కనుగొన్నారు. ఆ తర్వాత భారత సైన్యం (ప్రత్యేకించి డోగ్రా స్కౌట్‌లు) కొన్నేళ్లలో అనేక సార్లు సాహసయాత్రలు చేపట్టింది. 2005, 2006, 2013, 2019లో సెర్చ్ మిషన్‌లు నిర్వహించారు. ప్రమాదకరమైన పరిస్థితుల కారణంగా సెర్చ్ ఆపరేషన్ అక్కడ అత్యంత కఠినంగా ఉంటుంది. దీంతో 2019 నాటికి కేవలం ఐదుగురి మృతదేహాలు మాత్రమే గుర్తించగలిగారు.

తాజాగా మరో నలుగురి మృతదేహాలను గుర్తించడంతో ఏఎన్-12 విమానంలో ప్రయాణించిన సిబ్బంది అవశేషాలను వెలికితీసేందుకు కొనసాగుతున్న సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌లో గణనీయమైన పురోగతిని సాధించామని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. మిగతా మృతదేహాలను కూడా గుర్తించవచ్చనే ఆశ కలిగిందని ఆర్మీ అధికారి పేర్కొన్నారు.

నాలుగు మృతదేహాలు లభ్యమవ్వగా ముగ్గురి పేర్లు మల్ఖాన్ సింగ్, సిపాయి నారాయణ్ సింగ్, క్రాఫ్ట్స్‌మెన్ థామస్ చరణ్‌‌లుగా గుర్తించామని తెలిపారు. మరో మృతదేహాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయామని అన్నారు. అయితే వారి బంధువుల వివరాలు లభ్యమయ్యాయని వివరించారు. చరణ్ స్వస్థలం కేరళలోని పతనంతిట్ట జిల్లా ఎలంతూరు అని చెప్పారు.

More Telugu News