KTR: శ్రీధర్ బాబు సంస్కారవంతుడే కానీ, ఓటుకు నోటు దొంగతో కలిసి చెడిపోయాడు: కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు

KTR hot comments on Sridhar Babu and Revanth Reddy

  • శ్రీధర్ బాబు చదువుకున్నవాడని గౌరవం ఉండేదన్న కేటీఆర్
  • కానీ ఇప్పుడు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపాటు
  • బుల్డోజర్ వస్తే నాతో సహా అందరం అడ్డుపడతామన్న కేటీఆర్

మంత్రి శ్రీధర్ బాబు చదువుకున్నవాడని, సంస్కారం ఉన్నవాడని తమకు గౌరవం ఉండేదని, కానీ ఆయనకు సహవాస దోషం అంటుకున్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓటుకు నోటు దొంగలతో కలిసి కూర్చొని శ్రీధర్ బాబు కూడా చెడిపోయారన్నారు. అందుకే సంస్కారవంతుడైన శ్రీధర్ బాబు కూడా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మూసీ బాధితులు ఏడుస్తుంటే కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

రూ.5 వేల రూపాయల కోసమే వారు మాట్లాడుతున్నారని ఓ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ నేతల్లాగా ప్రజలు ఉండరని గుర్తించాలన్నారు. రూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకోవడం, రూ.500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పర్సెంటేజీలు పంచుకొని... ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ వాళ్లకే సాధ్యమన్నారు. అయితే, ఈ కాంగ్రెస్ నేతల దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు లేవన్నారు.

గూడు చెదిరి పిల్లలు, మహిళలు ఏడుస్తుంటే శ్రీధర్ బాబు మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఆత్మగౌరవం మీద కొడితే తెలంగాణ ప్రజలు తిరగబడతారని, ఊళ్లలో తిరగలేని పరిస్థితి వస్తుందని శ్రీధర్ బాబు తెలుసుకోవాలన్నారు. 

ప్రస్తుతం శ్రీధర్ బాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మీద గౌరవం పోతోందన్నారు. మొన్ననేమో పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య కొట్లాట అని అతితెలివి ప్రదర్శించారని, నిన్ననేమో రూ.5 వేల కోసం బూతులు తిడుతున్నారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇళ్లను కూలగొడితే సామాన్యులు తిట్టకుండా దేవుడిలా చూసి మొక్కుతారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ హెచ్చరిక

మూసీ బాధితులు తిడుతున్న తిట్లు ఆశ్చర్యపరిచినట్లు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మూసీ బాధితులు తీవ్ర ఆగ్రహంతో  ఉన్నారని, కాబట్టి కాంగ్రెస్ నేతలు అటువైపు వెళ్లవద్దని హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ నేతలు అటువైపు వెళితే ఏం జరిగినా బాధ్యత మాత్రం తమది కాదన్నారు.

బుల్డోజర్ వస్తే నాతో సహా అడ్డుపడతాం

వేలాది కుటుంబాలను, లక్షలాది ప్రజలను రోడ్డున పడేస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బుల్డోజర్ వస్తే తనతో సహా బీఆర్ఎస్ వాళ్లంతా అడ్డుపడతారని హామీ ఇచ్చారు.

హైడ్రా విషయమై అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామన్నారు. ఇప్పటికే సామాన్యులకు ఊరట కలిగించే విధంగా హైకోర్టు సూచనలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం సాగరహారం జరిగి 12 ఏళ్లు అవుతోందని, మళ్లీ అలాంటి ఉద్యమం చేయవలసి వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. పేదల కడుపు కొట్టకుండా మూసీ సుందరీకరణ పనులు చేపట్టవచ్చన్నారు.

రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఇళ్లు కూల్చుతారా?

ఊళ్లో రేవంత్ రెడ్డి ఇల్లు కుంటపై, సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని, వాటిని కూల్చుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయినా అసలు ఇప్పటి వరకు మూసీ డీపీఆర్ రాలేదని, అలాంటప్పుడు ఇప్పుడే ఖాళీ చేయించడం ఎందుకు? అని ప్రశ్నించారు. 

కూల్చివేతల కోసం రేవంత్ రెడ్డి రెడ్ లైన్ వేయకముందే వారికి డెడ్ లైన్ పెడతామని హెచ్చరించారు. నిర్వాసితులను ముట్టుకుంటే తప్పకుండా కదం తొక్కుతామన్నారు. ప్రజాకోర్టుకు... సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేశాక మూసీ వద్దకు రావాలని సవాల్ చేశారు.

వీళ్లు విధ్వంసం చేయకుంటే చాలు

హైడ్రా విషయంలో హైకోర్టులో ఈ రోజు రిలీఫ్ వచ్చిందని కేటీఆర్ అన్నారు. హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాద్ మునిగిపోతుందని అధికార పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వీళ్లు లేకపోతే హైదరాబాద్ నగరమే లేనట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వీళ్లు విధ్వంసం చేయకుంటే చాలు అన్నారు. 

హైడ్రా కారణంగా నగరంలో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని వెల్లడించారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 50 ఏళ్ల క్రితం కట్టిన వాటిని కూడా కూల్చుతామంటే కుదరదని, మీ జాగీరు కాదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News