Telangana: రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తాం: మంత్రి పొంగులేటి
- సామాన్య ప్రజలకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయనున్నామన్న పొంగులేటి
- ఉద్యోగుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్న మంత్రి
- తహసీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తామని హామీ
రాష్ట్రంలో సామాన్య ప్రజలకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్శిటీలో ఆదివారం 33 జిల్లాల తహసీల్దార్లతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రామ, మండల స్థాయిలో ఉండే సమస్యలు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖాముఖి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ చట్టాల సవరణకు రెవెన్యూ అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖలకంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని, అన్ని సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తహసీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లలా పని చేసి ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు.