Virat Kohli: కోహ్లీ మాత్రమే ఆర్సీబీ జట్టులో ఉంటాడు.. ఆ మాజీ ఆటగాడి అంచనా ఇదే!

RP Singh has passed a huge verdict on franchise Royal Challengers Bengaluru

  • కోహ్లీని తప్ప మిగతా అందరినీ విడుదల చేస్తారన్న మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్
  • రజత్ పటీదార్, మహ్మద్ సిరాజ్ రూ.11 కోట్ల కంటే ఎక్కువ ధర పలకరని అంచనా
  • ఎక్కువ ధర పలికినా ఆర్టీఎం నిబంధన ఉపయోగించి దక్కించుకోవచ్చని సూచన

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బీసీసీఐ రెండు రోజుల క్రితమే విడుదల చేసింది. ప్రతి ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చని (రిటెయిన్) స్పష్టం చేసింది. దీంతో నిలుపుదల చేసుకోవాల్సిన ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు దృష్టిసారించాయి. తుది కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టుపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తన అంచనాలను వెల్లడించాడు.

విరాట్ కోహ్లీని మాత్రమే ఆర్సీబీ రిటెయిన్ చేసుకుంటుందని, మిగతా ఆటగాళ్లు అందరినీ విడుదల చేస్తుందని ఆర్పీ సింగ్ విశ్లేషించాడు. ఆర్టీఎం నిబంధనపై ఆర్సీబీ ఆధారపడుతుందని భావిస్తున్నట్టు చెప్పాడు. ‘కలర్స్ సినీప్లెక్స్‌’లో జరిగిన డిబేట్‌లో ఆర్‌పీ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఆర్సీబీకి ఎలాంటి సమస్యా లేదని నేను భావిస్తున్నాను. విరాట్ కోహ్లీని మాత్రమే ఉంచుకుంటారు. అందరినీ విడుదల చేస్తారు. ఆర్టీఎంను ఉపయోగిస్తారు’’ అని ఆర్పీ సింగ్ అన్నాడు.

‘‘రజత్ పటీదార్‌ని ఉదాహరణగా తీసుకుంటే.. వేలంలో అతడు రూ.11 కోట్ల కంటే తక్కువ ధర పలుకుతాడని నేను భావించడం లేదు. కాబట్టి వేలంలో అతడిని తిరిగి దక్కించుకోవచ్చు. అతడి ధర రూ.11 కోట్లకు చేరుకున్నా ఆర్టీఎం నిబంధనను ఉపయోగించి తిరిగి పొందొచ్చు. ఇక పేసర్ మహ్మద్ సిరాజ్‌ ప్రదర్శన పరంగా చూస్తే అతడు రూ.11 కోట్ల వరకు ధర పలకవచ్చు. రూ.14 కోట్ల వరకు పలుకుతాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అంత ధర పలికినా ఆర్టీఎం నిబంధన ఉంటుంది కాబట్టి తిరిగి దక్కించుకోచ్చు’’ అని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు.

కాగా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతున్నాడు. ఇప్పటివరకు 252 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 8,004 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్‌లో కోహ్లీ అత్యధికంగా 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు సాధించాడు.

  • Loading...

More Telugu News