Israel: మరో టార్గెట్‌పై ఇజ్రాయెల్ పంజా.. యెమెన్‌లో హౌతీ టార్గెట్‌గా భీకర దాడులు

Israel strikes Houthi targets including fighter jets and power plants and a sea port

  • యుద్ధ విమానాలు, పవర్ ప్లాంట్లపై దాడి
  • రాస్ ఇస్సాలోని నౌకాశ్రయం ధ్వంసం
  • నలుగురి మృతి, 29 మందికి గాయాలు

పాలస్తీనాలో హమాస్.. లెబనాన్‌లో హిజ్బుల్లాపై దాడుల తర్వాత.. తాజాగా యెమెన్‌లో హౌతీ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ గురిపెట్టింది. ఆదివారం భీకర దాడులతో విరుచుకుపడింది. హౌతీ లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపింది. డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, పవర్ ప్లాంట్లు, ఒక నౌకాశ్రయాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. రాస్ ఇస్సా‌లోని హోడెయిడా పోర్టుపై దాడి చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ‘‘ మా సందేశం చాలా స్పష్టంగా ఉంది. మా భద్రతా బలగాలకు ఏ ప్రదేశమూ అంత ఎక్కువ దూరంలో లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వ్యాఖ్యానించారు.

కాగా దాడి జరిపిన హుడెయిడా పోర్టు హౌతీ మిలిటెంట్లకు చాలా ముఖ్యమైనది. చమురు దిగుమతి కోసం ఈ నౌకాశ్రయాన్ని ఉపయోగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఉండడంతో ఈ పోర్ట్ ద్వారానే ఇరాన్ ఆయుధాలను ఈ ప్రాంతానికి చేరవేస్తున్నారు. చమురు రవాణాతో పాటు సైనిక అవసరాల కోసం దీనినే ఉపయోగిస్తున్నారని, అందుకే దాడి చేసినట్టు ప్రకటనలో ఐడీఎఫ్ పేర్కొంది.

ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు చనిపోయారని, 29 మంది గాయపడ్డారని హౌతీ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న ఈ మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ దళాలు దూకుడుగా వైమానిక దాడులను చేస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా యెమెన్‌లోని లక్ష్యాలపై గురిపెట్టాయి. గత రెండు రోజులుగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతోంది. దాని చీఫ్ హసన్ నస్రల్లాను కూడా అంతమొందించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News