Harish Rao: రేవంత్ తుగ్లక్ చర్యలకు ఎవరూ అధైర్యపడవద్దు: హరీశ్ రావు

Harish Rao slams CM Revanth Reddy

  • మూసీ సుందరీకరణ పేరిట కూల్చివేతలు
  • బాధితులకు తాము అండగా ఉంటామన్న హరీశ్ రావు
  • బుల్డోజర్లు తమను దాటుకుని వెళ్లాలని వ్యాఖ్యలు

మూసీ సుందరీకరణ, హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యలకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శించారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని అన్నారు. మూసీ, హైడ్రా బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ నేతలు ఇవాళ హైదర్‌షాకోట్‌లో ఇళ్లను పరిశీలించారు.  

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మీ ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం వచ్చి రక్షణ కవచంలా నిలబడతాం అని హరీశ్ రావు పేర్కొన్నారు. బుల్డోజర్లు వస్తే ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప, మీ ఇళ్లను తాకే ప్రశ్నే లేదు అని. భరోసా ఇచ్చారు. 

ఇదే మూసీ నదిపై కొత్తగా ఆరు పెద్ద పెద్ద బహుళ అంతస్తు భవనాలు నిర్మిస్తున్నారని, పేదల ఇళ్లను కూల్చివేసే రేవంత్ రెడ్డి... ఆ కొత్త భవనాలను ఎందుకు కూల్చివేయడం లేదు? అని ప్రశ్నించారు. పేదవాళ్లు నోరు లేని వాళ్లని, ఏంచేసినా ఎవరూ రారు అనుకుంటున్నావా? పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, కేసీఆర్ తోడుంటాడని గుర్తించాలి అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. 

మీ బాధ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి

1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బాధితులందరికీ అనుమతులిచ్చింది. రేవంత్‌రెడ్డి.. మీ తప్పిదాలకు పేదలకు ఎందుకు బలికావాలి..? ఇందిరమ్మ పాలన అంటే... పేదలకు కూడు, గుడ్డ, నీడ ఇచ్చేది. కానీ మీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తున్నావ్! 

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది... అందుకే హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి. మీ బాధ చూస్తుంటే.. నా కళ్లలో నీళ్లు వస్తున్నాయ్. మీ బాధలు వింటుంటే.. మీ కన్నీళ్లు చూస్తుంటే.. రాతి గుండె కూడా కరిగిపోతుంది.. కానీ, రేవంత్ గుండె ఎందుకు కరుగతలేదో నాకు అర్ధం కావాట్లేదు.

ముందు నువ్వు కట్టుకున్న ఇల్లు కూలగొట్టు

రేవంత్ రెడ్డీ... కొడంగల్‌లోని సర్వే నెంబర్ 30 లో నువ్వు కట్టుకున్న ఇళ్లు  రెడ్డికుంటలో కట్టినవ్.. ముందు దాన్ని కూలగొట్టు. నీ తమ్ముడి ఇళ్లు కూడా ఎఫ్‌టీఎల్‌లో ఉన్నది.. నీ తమ్ముడికి, నీకు ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయా? 

దేశాన్ని కాపాడటం కోసం సరిహద్దుల్లో పోరాటం చేసిన సైనికులు... ఇప్పుడు ఇళ్లు కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సి వస్తుంది. రేవంత్‌రెడ్డి.. నీ ప్రభుత్వ జీవిత కాలం ఐదేండ్లు మాత్రమే.. కానీ నువ్వు కూల గొట్టే పేదల ఇళ్లు జీవిత కాలం కల.

నిజాం కంటే దారుణంగా...

1908లో వరదలొచ్చినా నిజాం రాజు ఇళ్లు కూలగొట్టలేదు. కానీ రేవంత్ నిజాం కంటే దారుణంగా వ్యవహరిస్తున్నాడు. బలిసినోళ్లకు ఒక న్యాయం... పేదోడికి ఒక న్యాయమా...? ప్రజలకు ఇబ్బంది వస్తే తెలంగాణ భవన్‌కు రండి.. 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయ్... అర్ధరాత్రి వచ్చినా... మీకు ఆశ్రయమిస్తాం... అత్యవసరమైతే ఫోన్ చేయండి... పదిహేను నిమిషాల్లో మీ ముందుంటాం.

రేవంత్‌రెడ్డీ... బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వు

రేవంత్ రెడ్డీ... మౌనం వీడి.. మూసీ సుందరీకరణ మానుకో. బయటికొచ్చి బాధితులకు భరోసా ఇవ్వు. స్కూళ్లలో, హాస్టల్స్‌లో టాయిలెట్స్ లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నీ దగ్గర పైసలు ఎక్కువుంటే ముందు వాటిని నిర్మించండి. గాంధీ ఆస్పత్రిలో మందులు లేవు... ముందు అవి కొని, పేదలకు మెరుగైన వైద్యం అందించు. రేవంత్... మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల ఉసురు పోసుకోకు... అంటూ హరీశ్ రావు హితవు పలికారు.

  • Loading...

More Telugu News