Pawan Kalyan: లంచాలకు తావు లేకుండా బదిలీలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

transparent transfers in panchayati raj says deputy cm pawan kalyan

  • ప్రజా ప్రయోజనం, అభివృద్ధే లక్ష్యాలుగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతోందన్న పవన్ కల్యాణ్
  • బదిలీల్లో అధికారుల ప్రతిభ, సమర్థత, నిబంధనలు కొలమానాలుగా తీసుకున్నామని చెప్పిన పవన్
  • ఆరోపణలు ఉన్న అధికారులకు కీలక పోస్టులు ఇవ్వలేదన్న పవన్ కల్యాణ్

పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు పారదర్శకంగా .. లంచాలకు తావు లేని విధంగా పూర్తి చేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు దాటిన సందర్భంగా పవన్ కల్యాణ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా ప్రయోజనం, అభివృద్ధే లక్ష్యాలుగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతోందని చెప్పారు. తాను చేపట్టిన శాఖల్లో పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని నిశ్చయించుకున్నానని తెలిపారు. 

సీఎం చంద్రబాబు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రితపక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసేలా పని చేస్తుందని చెప్పారన్నారు. అందుకు అనుగుణంగా బదిలీల్లో అదికారుల ప్రతిభ, సమర్థత, నిబంధనలు కొలమానాలుగా తీసుకున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు, సహచర మంత్రుల నుండి వచ్చిన సిఫార్సులు కూడా నిర్దేశించుకున్న కొలమానాలకు అనుగుణంగా ఉంటేనే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపానన్నారు. ఏ దశలోనూ బదిలీల సిఫార్సుల్లో ఆర్ధిక లావాదేవీలు లేకుండా చూసుకున్నామని తెలిపారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులకు మాత్రమే డ్వామా పీడీ, ఏపీడీ, జడ్పీ సీఈవో పోస్టులు ఇవ్వాలని నిర్ణయిం తీసుకున్నామని పేర్కొన్నారు. రాయలసీమలోని ఓ జిల్లాలో ఒక అధికారి చేరి రెండు దశాబ్దాలు దాటినా జిల్లా స్థాయి పోస్టు చేయలేదని తన దృష్టికి రాగా ఆయనకు తగిన పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆరోపణలు ఉన్న అధికారులకు కీలక పోస్టులు ఇవ్వలేదని పవన్ కల్యాణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News