Team India: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన.. ఐపీఎల్ సంచలనానికి తొలిసారి అవకాశం

BCCI announced squad for the three match T20I series against Bangladesh

  • సారధ్యం వహించనున్న సూర్యకుమార్ యాదవ్
  • యువ పేసర్ మయాంక్ యాదవ్‌ను తొలిసారి ఎంపిక చేసిన సెలక్టర్లు
  • హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలకు కూడా అవకాశం

బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. 15 మంది సభ్యులతో ప్రకటించిన జట్టుకు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో హార్దిక్ పాండ్యాకు కూడా చోటుదక్కింది. ఇక గత ఐపీఎల్ సీజన్‌లో సంచలన ప్రదర్శన చేసిన యువ ఆటగాడు మయాంక్ యాదవ్‌కు తొలిసారి జట్టులో అవకాశం లభించింది. క్రమం తప్పకుండా గంటకు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఈ పేసర్‌కు సెలక్టర్లు తొలిసారి అవకాశం కల్పించారు. 

ఇక టీ20 వరల్డ్ కప్ 2021లో చివరిసారిగా భారత జట్టుకు ఆడిన వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. భారత్ తరపున ఆడని కొత్త ఆటగాళ్లు కొందరు ఉన్నారు. మయాంక్‌ యాదవ్‌తో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి జట్టులో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆటగాళ్లలో ఒక్కరికి కూడా టీ20 జట్టులో చోటుదక్కలేదు. 

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

కాగా బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య ‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ టీ20 సిరీస్ జరగనుంది. గ్వాలియర్, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News