IPL 2025: ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త
- మ్యాచ్ ఆడే ఆటగాడికి రూ.7.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం
- ఎక్స్ వేదికగా ప్రకటించిన జైషా
- సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే రూ.1.05 కోట్లు ఆర్జించనున్న ఆటగాడు
ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. ఒక్కో మ్యాచ్‌కు ఆటగాడికి రూ.7.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.
ఆటగాడు ఆడే ప్రతి మ్యాచ్‌కు ఈ మొత్తం చెల్లించాలని పేర్కొన్నారు. అంటే ఒక ఆటగాడు సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీజు రూపంలో రూ.1.05 కోట్లు ఆర్జిస్తాడు. ప్రస్తుతం ఆటగాళ్లు వేలంలో వచ్చిన కాంట్రాక్ట్ మొత్తాన్ని మాత్రమే పొందుతున్నారు. ఇప్పుడు మ్యాచ్ ఆడితే అదనంగా రూ.7.5 లక్షలు పొందుతారు. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల కోసం ఒక్కో ఫ్రాంచైజీకి రూ.12.60 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చనే విషయమై రేపు జరగనున్న బీసీసీఐ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. జట్టు యాజమాన్యాల నుంచి కూడా బోర్డు సూచనలు తీసుకోనుంది. ఒక్కో జట్టు ఐదుగురిని అట్టిపెట్టుకునే అవకాశం ఇవ్వవచ్చు. ఎక్కువ ఫ్రాంచైజీలు ఇదే కోరుతున్నాయి. అలాగే ఆటగాళ్ల కోసం ఒక్కో జట్టు వెచ్చించే శాలరీ క్యాప్‌ను రూ.90 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెంచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.