Dola Balaveeranjaneya Swamy: టీటీడీ నిబంధనలు కులానికి కాదు మతానికి అని జగన్ కు తెలియదా?: మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
- నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
- డిక్లరేషన్ లో నా మతం మానవత్వం అని రాసుకోండి అంటూ వ్యాఖ్యలు
- జగన్ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. డిక్లరేషన్ ఇమ్మంటే నా మతం మానవత్వం అంటూ జగన్ అమాయకత్వం నటిస్తున్నారని విమర్శించారు.
దళితుడైన సుబ్రహ్మణ్యంను మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు నీ మానవత్వం ఏమైంది? తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలంటూ... నీ చెల్లెలు సునీత రెడ్డి కన్నీరు కార్చినప్పుడు నీ మానవత్వం ఏమైంది? అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టడమేనా నీ మానవత్వం? అంటూ మంత్రి మండిపడ్డారు.
"నాకే ఇలా ఉంటే... దళితుల పరిస్థితి ఏంటని కులాల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు. హిందువులుగా ఉన్న దళితులు శ్రీవారిని దర్శించుకోవడం లేదా? టీటీడీలో నిబంధనలు కులానికి కాదు, మతానికి అని జగన్ కి తెలియదా? ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన నీచ రాజకీయాలు మానుకోలేదు. ఎవరైనా సరే నిబంధనల్ని గౌరవిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలి. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పోడా ? జగన్ డిక్లరేషన్ ఎందుకివ్వరు?" అంటూ మంత్రి బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు.