Roja: జగన్ నిజమైన భక్తుడు... ఆయన ఎప్పుడైనా తిరుమల వెళ్లగలడు: రోజా

Roja slams Chandrababu on Jagan declaration issue
  • నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
  • ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని వ్యాఖ్యలు
  • జగన్ కు దమ్ముంటే నోటీసులు చూపించాలన్న సీఎం చంద్రబాబు
  • జగన్ దమ్ము, ధైర్యం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్న రోజా
నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్... తనకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని చెప్పారు. అందుకు సీఎం చంద్రబాబు స్పందిస్తూ... దమ్ముంటే ఆ నోటీసులు చూపించాలని జగన్ కు సవాల్ విసిరారు. దీనిపై వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా స్పందించారు. జగన్ నిజమైన భక్తుడు... ఆయన మళ్లీ ఎప్పుడైనా వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోగలరని స్పష్టం చేశారు.

జగన్ దమ్ము, ధైర్యం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు భావిస్తే, అది ఆయన భ్రమేనని విమర్శించారు. ప్రజలను మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయడం కుదరదని చంద్రబాబు తెలుసుకోవాలని పేర్కొన్నారు. 

"జగన్ తన తిరుమల పర్యటనపై నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారు. జగన్ చెప్పిన విషయాలను ఒప్పుకోకుండా చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. జగన్ తిరుమల రావడానికి భయపడుతున్నాడని, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి రాకుండా తప్పించుకున్నాడని చంద్రబాబు మాట్లాడుతున్నారు. 

జగన్ భయపడేవాడే అయితే నిన్న ధైర్యంగా ఎలా ప్రెస్ మీట్ పెట్టారు? తన మతం మానవత్వం అని జగన్ స్పష్టంగా చెప్పారు. జగన్ బైబిల్ చదువుతారు... బయటికొచ్చి హిందువుల మనోభావాలను గౌరవిస్తారు, పూజలు చేస్తారు. మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు, సిక్కులను కూడా అదే విధంగా గౌరవిస్తారు. ఈ విషయాలను జగన్ స్పష్టంగా చెప్పారు. 

దేవుడంటే మీకు భయం, భక్తి లేదు. ఎవరైనా సరే దేవుడి దగ్గరకు వెళ్లేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో దేవుడ్ని పూజించాలని భావిస్తారు. కానీ తిరుమల వస్తానని జగన్ ప్రకటించినప్పటి నుంచి బీజేపీలో కొందరు, జనసేన, టీడీపీ నేతలు ఎలా అలజడి సృష్టిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. 

అలిపిరి వద్ద అటాక్ చేస్తాం, అడ్డుకుంటాం అని చెప్పడం... వైసీపీ నేతలకు, కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం... జగన్ పర్యటనకు అనుమతి లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తాం అని భయభ్రాంతులకు గురిచేయడం అందరూ చూశారు. కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా, మత రాజకీయాలు కూడా చేస్తున్నారు. 

ఇలాంటి వాతావరణంలో ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోలేం కాబట్టే జగన్ తన పర్యటన రద్దు చేసుకుని తన అభిప్రాయాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. 

జగన్ తన పాలనలో ఐదేళ్లపాటు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కానీ, డిక్లరేషన్ పేరుతో కూటమి నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ను తిరుమల రాకుండా ఎవరు అడ్డుకున్నారంటూ మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబూ... నీకు, నీతో పాటు ఆడిస్తే ఆడేవాళ్లకు భగవంతుడు గట్టిగా సమాధానం చెబుతాడు" అని రోజా పేర్కొన్నారు.
Roja
Jagan
Tirumala
Chandrababu
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News