Bandi Sanjay: తిరుమల డిక్లరేషన్‌పై జగన్ వ్యాఖ్యలు... తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay fires at YS Jagan over Tirumala declaration

  • మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని నిలదీత
  • ఎవరి మత సాంప్రదాయనికి సంబంధించి వారికి నిబంధనలు ఉంటాయన్న సంజయ్
  • జగన్ తన తండ్రి బాటలో నడుస్తున్నాడని విమర్శలు
  • హైడ్రా కూలుస్తున్న ఇళ్ళన్నీ హిందువులవేనని విమర్శ

తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడుతున్న ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ నిలదీశారు. ఈరోజు బండ్లగూడ జాగీర్‌లో విద్యారణ్య భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎవరి మత సాంప్రదాయానికి సంబంధించి వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయన్నారు. హిందువులపై, తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడిన జగన్ మరింత అపవాదును మూటగట్టుకున్నారని విమర్శించారు. జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించలేదని, అదే ఇప్పుడు జగన్ ఫాలో అవుతున్నారని విమర్శించారు. 

కూలుస్తున్న ఇళ్లన్నీ హిందువులవే

హైడ్రా కూల్చుతున్న ఇళ్లన్నీ హిందువులవేనని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరివితో తలగోక్కుంటుందని విమర్శించారు. హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ ఈ కారణంగా పేదలు రోడ్డున పడవద్దని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల కారణంగా పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డౌన్ అవుతుందన్నారు. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పట్టడం ఖాయమన్నారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతుందని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ నిధులే అంశంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమా? అని సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంచి విజయం సాధిస్తుందన్నారు.

More Telugu News