Hassan Nasrallah: హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం... ఇజ్రాయెల్ ప్రకటన
- మధ్య ప్రాచ్యంలో ఉగ్రవాద సంస్థలపై ఇజ్రాయెల్ పంజా
- కీలక నేతలను మట్టుబెడుతున్న ఇజ్రాయెల్ దళాలు
- నస్రల్లా బీరూట్ శివార్లలో ఉన్నాడని కచ్చితమైన సమాచారం అందించిన నిఘా వర్గాలు
- దూసుకెళ్లిన ఇజ్రాయెల్ వాయుసేన జెట్ ఫైటర్లు
ప్రమాదకర ఉగ్రవాద సంస్థ హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబానాన్ లోని బీరూట్ నగర శివార్లలో నిన్న జరిపిన దాడిలో హసన్ నస్రల్లా మరణించాడని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు వెల్లడించాయి. ఈ భీకర దాడిలో నస్రల్లాతో పాటు హిజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ అల్ కరాచీ కూడా ఉన్నట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.
నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు బీరూట్ దిశగా దూసుకెళ్లాయి. హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించాయి.
ఇజ్రాయెల్ సర్వ సైన్యాధికారి దీనిపై స్పందిస్తూ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ఇది ముగింపు కాదని, తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పౌరులకు ముప్పుగా పరిణమించే ఎవరినైనా సరే... ఎలా వారి అంతు తేల్చాలో మాకు తెలుసు... ఇంతకంటే స్పష్టమైన సందేశం ఇవ్వలేం అని పేర్కొన్నారు. నస్రల్లా కథ ముగిసింది... ఇక అతడు ఎంత మాత్రం ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయపెట్టలేడు అని ఆ ప్రధాన సైన్యాధికారి తెలిపారు.